నీటి ఎద్దడి గల ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించండి
అన్ని సిపిడబ్ల్యుస్ పధకాలను పూర్తిగా పనిచేసేలా చర్యలు తీసుకోండి
సురక్షిత తాగునీటిని అందించేందుకు ప్రతిరోజు నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించాలి
తాగునీటి సరఫరా పరిస్థితులను గ్రామ స్థాయి వరకూ ప్రతి రోజు పర్యవేక్షించండి
తాగునీటి సరఫరాపై సిద్ధం చేసిన యాప్ ను వెంటనే అందుబాటులోకి తీసుకురండి
నీటి వృధాను అరికట్టి తాగునీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంపొందిచాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
వెలగపూడి, ప్రధాన ప్రతినిధి :రాష్ట్రంలో గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జల వనరులు, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, మున్సిపల్ తాగునీటి సరఫరా విభాగాల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ఆదేశించారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితులపై గురువారం వెలగపూడి సచివాలయంలో ఆయన జల వనరులు, పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పట్టణ మంచినీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ నీటి ఎద్దడి అధికంగా గల ప్రాంతాలు,ఆవాసాలకు ట్యాంకులు ద్వారా మంచినీటిని అందించాలని ఆదేశించారు.ఇటీవల బెంగుళూరు వంటి మహానగరాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్న నేపధ్యంలో తాగునీటి కోసం సరఫరా చేసే నీటిని ఇతర అవసరాలకు అనగా వాహనాలు, ఫ్లోర్లు శుభ్రం చేయడం గార్డెన్లకు వాడడం వంటి అవసరాలకు ఉపయోగించ కూడదని ప్రజలకు విజ్ణప్తి చేశారు. కుళాయిల ద్వారా నీటిని వృధాగా పోనీయకుండా చేయడం పైన, తాగునీటిని పొదుపుగా వినియోగించు కోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించేందుకు ప్రత్యేక ప్రచార అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని సిపిడబ్లుఎస్ స్కీమ్ లన్నీ సమక్రంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆర్డబ్లుఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించే ప్రక్రియలో భాగంగా ప్రతిరోజు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. తాగునీటి సరఫరా పరిస్థితులను గ్రామ స్థాయి వరకూ సంబంధిత శాఖల అధికారులు ప్రతిరోజు మానిటర్ చేయాలని ఆదేశించారు. తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేసే విధానాన్ని మానిటర్ చేసేందుకు రూపొందించిన యాప్ ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరులు,పంచాయితీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శిశిభూషణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ఇటీవల వివిధ జిల్లాల కలక్టర్లు, జలవనరులు, పంచాయితీరాజ్, ఆర్డబ్ల్యుఎస్,మున్సిపల్ వాటర్ వర్క్సు విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో తాగునీటి పరిస్థితులపై సమీక్షించామని తెలిపారు.26 జిల్లాలకు గాను 9 జిల్లాల్లో తాగునీటికి పెద్దగా ఇబ్బంది లేదని కలక్టర్లు నివేదించారని చెప్పారు.మిగతా 17 జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులను అధిక మించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.అన్ని సమ్మర్ స్టోరేజి ట్యాంకులను నీటితో నింపేందుకు అవసరమైన నీటిని కాలువల ద్వారా విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.అనంతరం జిల్లాల వారీగా తాగునీటి చెరువులు వాటికి ఆధారమైన రిజర్వాయర్లు,కాలువల గురించి వివరించారు. ఇప్పటి వరకూ జిల్లా కలక్టర్ల నుండి కరువు మండలాల్లో 388,ఇతర మండలాల్లో 492 మొత్తం 885 ఆవాసాలకు ట్యాంకులు ద్వారా నీటని సరఫరా చేయాలని ప్రతిపాదనలు రాగా ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకులు ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.ట్యాంకులు ద్వారా నీట సరఫరాపై ప్రత్యేకంగా ఎస్ఓపి(స్టాండర్డ్ ఆఫరేటింగ్ ప్రొసీజర్)ని రూపొందించామని అంతేగాక ప్రత్యేక యాప్ ను కూడా సిద్దం చేసి పరీక్షించామని సమక్రమంగా పనిచేస్తోందని శుక్రవారం ఈయాప్ ను అందుబాటులోకి తేనున్నట్టు వివరించారు.గ్రామ స్థాయిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధిత ఇంజనీర్ ఆమోదంతో ట్యాంకరు ద్వారా నీటి సరఫరా డిమాండ్ ను యాప్ లో అప్ లోడ్ చేసి జిల్లా కలక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే ఆమోదం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేసే ట్యాంకరు ధర,సోర్సు,రోజుకు ఎన్ని ట్రిప్పులు వేయాలనే అంశాలకు సంబంధించిన ఉత్తర్వులను జిల్లాకలక్టర్ జారీ చేస్తారని చెప్పారు.
సిడిఎంఏ కేశ్ బాలాజీ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలకు గాను 29 యుఎల్బిల్లో రోజుకు రెండు సార్లు, 52 యుఎల్బిల్లో రోజుకు ఒక సారి, 35 యుఎల్బిల్లో రెండు రోజులకు ఒకసారి, 7 యుఎల్బిల్లో 3 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నట్టు వివరించారు. నీటి ఎద్దడి గల శివారు ప్రాంతాలు,కాలనీలకు ట్యాంకరులు ద్వారా నీటిని అందించడం జరుగుతోందని తెలిపారు. 60 యుఎల్బిలకు ఈ వేసవిలో ఎలాంటి మంచినీటి ఇబ్బంది లేదని వివరించారు. కాగా 2 యుఎల్బిలకు ఏప్రిల్ 15 వరకూ,16 యుఎల్బిలకు ఏప్రిల్ 30 వరకూ, 25 యుఎల్బిలకు మే 31 వరకూ,20 యుఎల్బిలకు జూన్ 30 వరకూ తాగునీటికి ఇబ్బంది లేదని సిడిఎంఏ బాలాజీ రావు సిఎస్ కు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థికశాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, జల వనరుల శాఖ ఇఎన్సి నారాయణ రెడ్డి, భూగర్భ జల వనరుల శాఖ డైరెక్టర్ జాన్ సత్యరాజ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.