త్రాగునీరు, సాగునీటి సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం
జగన్ సభలకు వస్తున్న ఆదరణతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు
వైఎస్సార్సీపీకి ద్రోహం చేసిన వారికి తరిమికొట్టండి
నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి
నెల్లూరు నుంచి ప్రత్యేక ప్రతినిధి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అశీస్సులతో ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, తాగునీరు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామని రాజ్యసభ సభ్యులు, నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధి విజయసాయి రెడ్డి అన్నారు. గురువారం ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జగన్మోహన్ ప్రభుత్వంలో మండలంలో పొలంగారిపల్లి నుంచి గంధంవారిపల్లి వరకు 9 కిలోమీటర్లు, బెడుసుపల్లి నుంచి క్రిష్ణంపల్లె వరకు 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారని గుర్తుచేశారు. సాగునీటి సరఫరాకు, రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సోమశిల ప్రాజక్టు పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వెలుగొండ ప్రాజక్గు నుండి నీరు తెప్పిస్తూ మరోవైపు సోమశిల నుండి వచ్చే నీరు చెరువుల్లో నింపి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేస్తామని, తాగునీటికి సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తామన్నారు. సీతారాంపురంలో చెరువులన్నింటికీ తెలుగుగంగ, సోమశిల నీటితో ప్రతి ఆరు నెలలకు నింపుతాం. దీంతో సాగునీటికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. నెల్లూరు ప్రజలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, పార్టీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్ది మేకపాటి రాజగోపాల్ రెడ్డి, తాను ఈ ప్రాంత అభివృద్ధి, ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో సంక్షేమ పాలన : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా హోదా అనుభవించి, పార్టీకి వెన్నుపోటు పొడిచి పరాయి పంచన చేరిన ఫిరాయింపుదారులను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించ వద్దని, అటువంటి వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. చంద్రబాబు 14 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో కరువు కాటకాలు తాండవించాయని, ప్రజలు నికృష్ట పాలనను చూసారని, అది ప్రజలెవ్వరూ మర్చిపోకూడదని హితవు పలికారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కు ప్రజలు బుద్ది చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని గుర్తుచేశారు. దీంతో సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకుని ప్రజల ఆశీర్వాదంతో 2019 మే 30 న పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించారన్నారు. అప్పుడు వేసిన పునాదులే ప్రస్తుత కురుక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డిని విజయపథంలో నడిపిస్తున్నాయన్నారు.
జగన్ సభలతో ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు : జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుంచి లభిస్తున్న అనూహ్య ఆదరణతో ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు మొదలైందన్నారు. జగన్ రథచక్రాల కింద ప్రతిపక్షాలు నలిగిపోవడం ఖాయమన్నారు. 5 సంవత్సరాల పాటు సీఎం జగన్ సంక్షేమ రాజ్యం, అభివృద్ధి పాలన అందించారన్నారు.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా : నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, మేకపాటి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2012 నుంచి మూడు సార్లు పార్లమెంట్ కి, 2 సార్లు అసెంబ్లీకి పంపించి ఈ ప్రాంత ప్రజలు మేకపాటి కుటుంబ సభ్యులకు ఎంతగానో ఆదరించారని, రానున్న ఎన్నికల్లో మరోమారు మీ అభిమానం చూపించి ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. జగనన్న కాలనీ, ఇతర పెండింగ్ బిల్లు త్వరలో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నెల్లూరుకు సంబందించి పెండింగ్ బిల్లులు క్లియర్ చేసామని అన్నారు. అంతకు ముందు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడకు చేరిన జనసమూహం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని అన్నారు. ఈ జనాదరణ చేస్తే సీఎం జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు తమ ఓటుతో సరైన న్యాయం చేస్తారని బావిస్తున్నానన్నారు. త్వరలో కొత్త మేనిఫెస్టో రాబోతుందని, సీఎం జగన్ మచ్చలేని పాలన సాగించారన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత గొప్పగా ఎవరూ పరిపాలన చేయలేదని గుర్తు చేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు వాలంటీర్ల గురించి భయంకరంగా మాట్లాడుతున్నారని, వారు మాట్లాడిన మాట వారికే చెప్పుతో కొట్టినట్టు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇక్కడ ఉండేది ఒకటే పార్టీ, అది వైఎస్సార్సీపీ. ఇక్కడ ఉన్నవారంతా వైఎస్సార్సీపీ అభిమానులే. ఇక్కడకు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి రావడం మన అదృష్టమని అన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దులకు సీతారంపురం మండలంలో 5వేలకు మించి మెజారిటీ వచ్చేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
సీతారాంపురంలో జన జాతర : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు వైయాస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఉదయగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారితో సీతారామపురం (ఎస్.ఆర్ పురం) మండలం ఎల్.వీ.ఆర్ కాలేజ్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. మండు టెండను లెక్క చేయకుండా ప్రజలు ఈ ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొన్నారు.