విజయవాడ బ్యూరో ప్రతినిధి : ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని, తద్వారా నిండు నూరేళ్లు జీవించాలని విజయవాడ వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏ సి పి బి జనార్దనరావు హితవు పలికారు. బుధవారం గొల్లపూడి “వై” జంక్షన్ వద్ద ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహన చోదకులను నిలువరించారు. వారందరికీ జరిమానా లు, కేసులు నమోదు చేయకుండా కేవలం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ లేకుంటే ప్రయాణిస్తున్న ఎంతో మంది రోడ్డు ప్రమాదంలో నిండు జీవితాల్ని పణంగా పెడుతున్నారని, అకాల మృత్యువాత పడుతున్న వారి కుటుంబం ఏ ఆధారం లేకుండా ఎన్నో కష్టాలు పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయని జనార్దనరావు వివరించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదంలో చాలా మంది అకాల మృత్యువాత పడుతున్నారని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా చేజేతులారా మృత్యువుని ఆహ్వానించడం వద్దని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భవానీపురం సెక్టార్ సి ఐ బి వెంకటేశ్వరరావు ( బి వి రావు) ఆర్ ఎస్ ఐ శివరామకృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.