అమరావతి బ్యూరో ప్రతినిధి : గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు హింసాత్మక ఘటనలపై ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్ రెడ్డి, కె.రఘువీరారెడ్డిల నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వివరణ తీసుకున్నారు. ముగ్గురు ఎస్పీలు గురువాం సీఈవో మీనా ఎదుట హాజరుకాగా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? రాజకీయ హత్యల దాకా పరిస్థితులు దిగజారే వరకు ఎందుకు వేచి చూడాల్సి వచ్చిందని ఎస్పీలను ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గం చాలా కాలంగా సున్నిత ప్రాంతాల జాబితాలో ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేశారని పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని నిలదీశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హెచ్చరికలు జారీ చేసినా ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో నేరుగా ఈసీ నిఘా పెట్టిందన్నారు. ముగ్గురు ఎస్పీలు ఇచ్చిన వివరణల నివేదికలను సీఈవో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు.
2018 గ్రూప్-1 మెయిన్స్ సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు పాక్షిక స్టే
వెలగపూడి బ్యూరో ప్రతినిధి : ఏపీపీఎస్సీ 2018 గ్రూప్-1 అంశంలో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చి ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు పాక్షిక స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఉద్యోగంలో ఉన్నవారికి యథాతథ స్థితిని కల్పించింది. గ్రూప్ -1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. దీనిపై ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేశాయి. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తాజాగా పాక్షిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.