వైస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
గుంటూరు నుంచి ప్రత్యేక ప్రతినిధి : పదేళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం మొదలుపెట్టారని వైస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి పొత్తులు కొత్త కాదని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పదేళ్ల క్రితం ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ తర్వాత మర్చిపోయారని అన్నారు. నాడు విడాకులు తీసుకొని విడిపోయి, దూషించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీని ఆనాడు చంద్రబాబు ఇష్టానుసారం దూషించారని దుయ్యబట్టారు. ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారని సజ్జల మండిపడ్డారు. సీఎం జగన్‌ను విమర్శించడమే పని పెట్టుకున్నారని అన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా విమర్శలకే టైమ్ కేటాయించారని మండిపడ్డారు. సభ నిర్వహించడం చేతగాక పోలీసులపై విమర్శలా? అని ప్రశ్నించారు. అర్జెంట్‌గా అధికారంలోకి రావాలనేది వారి ఆత్రమని దుయ్యబట్టారు. 2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 2024లో మళ్లీ కలిసి స్టేజ్‌పై ప్రత్యక్షమయ్యారని అన్నారు. మళ్లీ ఇప్పుడెందుకు కలిశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని సజ్జల నిలదీశారు. పొత్తు కోసం వెంపర్లాడటం, తర్వాత విడిపోవటం, మళ్ళీ కలవటం ఇదే వీరి పని. అసలు ఎందుకు కలిశారు? ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు చెప్పాలి. 600 హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చెప్పాలన్నారు.
అర్హులందరికీ స్థలాలు ఇచ్చి, ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఎందుకు మోసం చేశారో చెప్పాలి?. మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఒకే స్టేజీ మీదకు వచ్చారు?. ఏపీ ప్రజలను తేలిగ్గా మోసం చేయవచ్చనే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయి. కనీసం చిన్న సభను కూడా జరుపుకోలేని వారు ప్రజలకు ఏం మేలు చేస్తారు?. ప్రధానిని సైతం అవమానపరిచారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఒక్కటేనని మోదీ చెప్పగానే జనం నమ్ముతారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రానికి కావాల్సిన అంశాల గురించి మోదీని ఎందుకు అడగలేదు?. నాయకుడికి ఒక స్థిరమైన నిజాయితీ ఉండాలి. సీఎం జగన్ ప్రభుత్వంలో 87 శాతం కుటుంబాలు లబ్ది పొందాయి. అందుకే సీఎం జగన్ జగన్ ప్రజలు ఓన్ చేసుకున్నారు. షర్మిల ఎక్కడ నుంచైనా పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ కాబట్టి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని సజ్జల మండిపడ్డారు.