వెలగపూడి బ్యూరో ప్రతినిధి : ‘ప్రజాగళం’ సభలో భద్రతా వైఫల్యంపై ప్రధాన ఎన్నికల అధికారి ఎం.కె.మీనాకు టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యముందని, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి వ్యవహారశైలి సరిగా లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఈవోకి ఫిర్యాదు చేసిన వారిలో వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, బి.రామకృష్ణ తదితరులు ఉన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ ‘‘సభ గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం. భద్రత గురించి ఈ నెల 12నే డీజీపీకి లేఖ రాశాం. ఆదివారం జరిగిన సభలో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించలేదు. సభను భగ్నం చేసేందుకు పల్నాడు ఎస్పీ వైసీపీ కార్యకర్తగా పనిచేశారు. ప్రధాని ప్రసంగించే సభలో మైక్‌కు అంతరాయం కలగడమేంటి? నలుగురు పోలీసు అధికారులపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. ఆ నలుగురు ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని, వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని ఈసీని కోరామని తెలిపారు.
పోలీస్ శాఖ బరితెగించి ప్రవర్తిస్తోంది : అధికార వైసీపీ అరాచకాలను పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేస్తుండటంపై పోలీస్ శాఖ మీద టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా పోలీస్ శాఖ బరితెగించి ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ‘ప్రజాగళం’ సభకు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయమని తాము 12వ తేదీన కోరామని, అయితే లక్షలాది మంది జనం వచ్చిన ఆ సభను చిన్నాభిన్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు. తన ప్రోటోకాల్ పక్కనపెట్టి మరీ విద్యుత్ పోల్స్ ఎక్కిన వాళ్లను కిందకు దిగమని ప్రధాని నరేంద్ర మోడీ కోరారని, దీన్ని బట్టి ఆ సభలో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చని తూర్పారపట్టారు. రాజేంద్రనాథ్ రెడ్డీ మీకు డీజీపీగా ఉండే అర్హత ఉందా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు సెక్యూరిటీ ఏర్పాట్లు చూడటంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఒక పోలీసు అధికారిగా కాకుండా వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు పోలీస్ అధికారిగా వ్యవహరించే తీరు ఇదేనా? అని నిలదీశారు. ఈ నలుగురు ఎన్నికల విధుల్లో ఉంటే ఎన్నికలు సజావుగా సాగవన్న ఆయన వీరిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని తాము ఎలక్షన్ కమిషన్ (ఈసీ)ని కోరామని అన్నారు.
వీళ్లు వైసీపీ కోసం దొంగ ఓట్లు కూడా వేయిస్తారని వ్యాఖ్యానించారు. ప్రధాని పాల్గొన్న సభలో కరెంట్ పోయినా పోలీసులు పట్టించుకోరా? అని అడిగారు. ఐజీ కంటే కానిస్టేబుల్ చాలా బాగా డ్యూటీ చేస్తాడని వర్ల రామయ్య కౌంటర్లు వేశారు. ఇదే సమయంలో బీజేపీ నేత పాతూరి నాగభూషణం కూడా పోలీస్ శాఖపై ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ వచ్చిన సభకు ట్రాఫిక్ ఆగిపోయిందని, తాము పాస్‌లు అడిగితే ఇవ్వలేదని, ఢిల్లీ నుంచి ఎన్ఎస్జీతో ఫోన్ చేయిస్తే పాస్‌లు ఇచ్చారని చెప్పారు. ఆరుగురు మహిళలకు మోడీ సన్మానం చేద్దామనుకుంటే అందుకు అనుమతి ఇవ్వలేదన్నారు. రానున్న రోజుల్లోనూ మోడీ , అమిత్ షా సభలు రాష్ట్రంలో జరగనున్నాయని, ఇలాంటి సంఘటలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. మరోవైపు మోడీ సభకు భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ ఫైర్ అయ్యారు. తాము ముందుగానే చెప్పినా పట్టించుకోలేదని, పల్నాడు ఎస్పీ రవిశంకర్ సభకు రాలేదని, ఆఫీస్‌లోనే కూర్చున్నారని చెప్పుకొచ్చారు.