ఎన్నికల షెడ్యూల్ వల్ల ఈ వెసులుబాటు వచ్చింది
ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలి…ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి
సిద్ధం సభల తరహాలోనే బస్సు యాత్రకూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి
రీజినల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ మోహన్ రెడ్డి
అమరావతి నుంచి ప్రత్యేక ప్రతినిధి : ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్యాంపు కార్యాలయంలో వైయస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ సమావేశమయ్యారు. మే 13న ఎన్నికలు జరుగుతున్నందున అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు. ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలన్నారు. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్నీ సదర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలన్నారు. ఈమేరకు అభ్యర్థులు కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. దీనిపై పార్టీకి చెందిన రీజినల్ కో-ఆర్డినేటర్లు వారికి మార్గనిర్దేశం చేయాలన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్లమెంటు నియోజకవర్గాల్లో మార్పులు చేశామని, అభ్యర్థులకు ఇప్పుడున్న సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నారు.
ఆయా నియోజకవర్గాలలోని పార్టీ శ్రేణులును, నాయకత్వాన్ని సంఘటితపరిచి, వారిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకునడవాలన్నారు. పార్టీ లక్ష్యం సాధించే దిశలో కలిసి వచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకుని , ఘనవిజయాలు నమోదు చేయాలన్నారు. రీజినల్ కో-ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు తమతమ ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుంటూ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా నిలవాలన్నారు. అలాగే బస్సు యాత్ర ప్రారంభమవుతున్నందున దీనికి అన్నిరకాలుగా సిద్ధంకావాలని, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ సభలు చరిత్రాత్మకం కావాలని జగన్, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు.