విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌ను ఖండిస్తున్నామని గంటా శ్రీనివాసరావు ట్విట్టర్లో పేర్కొన్నారు. అయ్యన్న అరెస్టు విషయంలో కనీసం ప్రోటోకాల్ లేకుండా అరెస్ట్ చేసిన విధానం అభ్యంతరకరమని అన్నారు. ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా అయ్యన్న అరెస్టుపై గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌కు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ మధ్యాహ్నం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. చింతకాయల అయ్యన్నపాత్రుడుని రాజమండ్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అర్థరాత్రి గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించారు. వీడియోలు తీస్తున్న మీడియా ఫోన్లను లాక్కున్నారు. ఇంటిగోడ కూల్చివేత వ్యవహారంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉంది. దీంతో సీఐడీ పోలీసులు అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేసి..అతనితో పాటు అతని కుమారుడు రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.