సీనియార్టీనీ బట్టి ప్రతి సంవత్సరానికి వేతనాన్ని కనీసం ఐదు శాతం పెంచాలి
మరో మారు ప్రభుత్వం దృష్టికి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు
ప్రభుత్వ కార్యదర్శి, ఆర్థిక శాఖ తో జరిగిన సమావేశంలో సమస్యలపై చర్చించిన బొప్పరాజు వెంకటేశ్వర్లు బృందం
పరిశీలించిన న్యాయం చేస్తామన్న ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి
త్వరితగతిన న్యాయం చేయాలని కోరిన కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్
వెలగపూడి నుంచి ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వ శాఖల పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రత్యేక సర్వీసు రూల్స్ ఏర్పాటుచేసి వారికి కనీస సౌకర్యాలు, భద్రత కల్పించి న్యాయం చేయాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే.సుమన్, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. త్వరిత గతిన ఉద్యోగులకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బొప్పరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాక్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదరి ఆధ్వర్యంలో, ఏపీ జెఎసి అమరావతి అనుబంధంగా ఉన్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గంతో బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యదర్శి తో సమావేశం జరిగింది. సమావేశం దృష్టికి బొప్పరాజు పలు సమస్యలు తీసుకువెళ్లారు. వాటిలో ముముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో పలు శాఖల్లో ఇంకా ఆప్కాస్ పరిధిలోనికి రాని వారందరిని ఆప్కాసులోనికి చేర్చాలని (ఫారెస్ట్, ఆర్టీసీ, గురుకులం, టూరిజం, ఇరిగేషన్, తదితర శాఖల్లో) కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలోని భర్తకు గాని, భార్యకు గాని ఉపాధి కల్పిస్తూ కారుణ్య నియామకాన్ని చేపట్టే విధంగా చూడాలని కోరారు. రెగ్యులర్ ఎంప్లాయ్ కి ఏ విధంగా మెడికల్ లీవులు అందిస్తున్నారో అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రత్యేక పరిస్థితుల్లో 30 రోజుల మెడికల్ లీవులు వర్తింప చేయాలని కోరారు. జిల్లాల వారీగా ఒకే హోదా ఉన్న ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ కి వేతనంలో వ్యత్యాసం లేకుండా అందరికీ సమానంగా ఒకే వేతనాన్ని అందించాలని కోరారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ బిపిఎల్ తో సంబంధం లేకుండా రైస్ కార్డులు మరియు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి చిరంజీవి చౌదరి దృష్టికి తీసుకువెళ్లారు.పలు శాఖలలో స్కిల్డ్, సెమీ స్కిల్ల్డ్, అన్ స్కీల్ల్డ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఆర్థిక శాఖ ఇచ్చిన జీవో నెంబర్.7 లో స్పష్టత లేని కారణంగా, వారి వేతనంలో వ్యత్యాసం ఉండడం వల్ల ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని మరి ముఖ్యంగా మున్సిపల్ శాఖ, వైద్య, సోషల్ వెల్ఫేర్ తదితర శాఖల్లో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలియజేశారు.అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పదవి విరమణ వయసు 60 నుండి 62 సంవత్సరాల పెంచాలని కోరారు.సీనియార్టీనీ బట్టి ప్రతి సంవత్సరానికి వేతనాన్ని కనీసం ఐదు శాతం పెంచాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం మెప్మా మరియు సేర్ఫ్ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన మాదిరిగా రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేసి తద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలని తెలియజేస్తూ ఇలా ప్రతి సమస్యను బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి చిరంజీవి చౌదరి దృష్టికి తీసుకువెళ్లి చిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.
బొప్పరాజు తీసుకువెళ్లిన సమస్యలపై ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి చిరంజీవి చౌదరి సానుకూలంగా స్పందిస్తూ విషయాలన్నిటిపై అధ్యయనం చేసి, ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేస్తామని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఏపీ జేఏసీ అమరావతి కి అనుబంధంగా ఉన్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేయించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.యస్.జవహర్ రెడ్డి, సమస్యలను సానుకూలంగా విని, పరిష్కార మార్గం చూపుతామని తెలిపిన ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి చిరంజీవి చౌదరికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం, ఏపీ జేఏసీ అమరావతి పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రమేష్ కుమార్, కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే సుమన్, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు, ఎన్టీఆర్ బాపట్ల జిల్లాల రెవెన్యూ అసోసియేషన్ జిల్లా చైర్మన్లు డి.శ్రీనివాస్, సి. హెచ్ సురేష్ బాబు, క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యస్.మల్లేశ్వరరావు, వీఆర్ఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గరికపాటి బ్రహ్మయ్య, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ మధు, జి సంపత్, సీడ్ ఆప్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాజర్ పలు శాఖలకు చెందిన ఔట్సోర్సింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.