పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలు సాధించొచ్చు
దేశాభివృద్దిలో ఇంజనీర్స్ పాత్ర కీలకం
కమ్యూనికేటివ్ స్కిల్స్ తో ఉజ్వల భవిష్యత్
ప్రతి ఏటా జాబ్ మేళాలు నిర్వహిస్తాం
విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎం.పీ విజయసాయి రెడ్డి
కావలి : నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఏటా జాబ్ మేళాలు నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి హామీ ఇచ్చారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి, విశాఖపట్నం, కడప, గుంటూరులో జాబ్ మేళాలు నిర్వహించామని, వేల సంఖ్యలో యువత ఉద్యోగాలు పొందారన్నారు. బుధవారం కావలిలో ఆర్ ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, పీబీఆర్ విట్స్ ఇంజనీరింగ్ కాలేజీలలో విడివిడిగా నిర్వహించిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో విజయ సాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆశలకు అనుగుణంగా లక్ష్యాలు ఏర్పరుచుకోవాలని, అందుకు పట్టుదలతో కృషి చేయాలన్నారు. సృజనాత్మకతతో ఆలోచిస్తే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. చదువుకునే సమయంలో ప్రతి ఒక్కరూ ఒక జీవిత లక్ష్యం ఏర్పరచుకుంటారని, అందుకు అనుగుణంగా తమ విద్యాభ్యాసం సాగిస్తారని చెప్పారు. పదవ తరగతి వరకు ఒకేలా చదువుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ, కామర్స్ కోర్సులు ఎంచుకుంటారని, అనంతరం ఇంజనీరింగ్, మెడిసిన్, అకౌంటింగ్ కోర్సులు చదువుతారని అన్నారు. విద్యాబ్యాసం చేస్తున్న సమయంలో తల్లిదండ్రులు, ఫీజు రీఎంబర్స్ మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన పథకాల రూపంతో ప్రభుత్వం సహకరిస్తారని అన్నారు. విద్య పూర్తి చేసుకొని మీ కాళ్ల మీద మీరు నిలబడాలని అందుకు కేవలం ఉద్యోగం మాత్రమే పరిష్కారం కాదని వ్యాపార, రాజకీయ, అనేక ఇతర రంగాల్లోనూ ఉన్నతంగా ఎదగొచ్చని అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్దులు కేంద్ర సర్వీసుల్లోనూ స్థిరపడవచ్చన్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించారని, 2029 ఎన్నికల్లో ఇటు పార్లమెంట్ లో అటు శాసనసభ లో ఎంపికైన ప్రతి ముగ్గురిలో ఒక మహిళ ఉంటారన్నారు. ఇటువంటి అవకాశాలు వినియోగించుకోవాలని అన్నారు. విద్యార్దులు పట్టుదలతో కృషి చేసి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
యువత రాజకీయాల వైపు ఆసక్తి చూపాలి : దేశాభివృద్దిలో ఇంజనీర్స్ పాత్ర అత్యంత ప్రాముఖ్యమైనదని, కమ్యూనికేటివ్ స్కిల్స్ పెంచుకోవడం ద్వారా ఎంచుకున్న రంగంలో మరింతగా రాణించొచ్చని అన్నారు. దేశాభివృద్ధికి ఇంజనీర్లు ప్రదర్శిస్తున్న సామర్థ్యం ఎనలేనిదని అన్నారు. విద్యార్థులతో ముఖాముఖి తనకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. తాను ఇంజనీరింగ్ చదవలేదని, అకౌంటింగ్ చదివానని, అయితే దేశాభివృద్దిలో ఇంజనీరింగ్ ప్రాముఖ్యతను గుర్తించగలని అన్నారు. ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లే వారు అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసి స్వదేశానికి తిరిగి రావాలని కోరారు. దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందిని అన్నారు. తాను చదువుకునే రోజుల్లో ఎక్కువ మంది కామర్స్, సైన్స్ కోర్సులు చదివేవారు. ఇంజనీరింగ్ చదివేందుకు అంతగా అవకాశాలు ఉండేవి కావు. అయితే ఇంజనీరింగ్ అనేక అవకాశాలకు ప్లాట్ ఫాం లాంటిదని అన్నారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన అనంతరం సివిల్స్ వైపు వెళ్లవచ్చని, యూపీఎస్సీకి ఎంపికవుతున్న వారిలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ విద్యార్దులేనని అన్నారు.అలాగే సైంటిస్ట్, స్పేస్ సైంటింట్స్, ఆర్మీ, వివిధ రంగాల్లో చేరవచ్చని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేక అవకాశాలు లభిస్తాయని అన్నారు. విదేశాల్లో ఎదురయ్యే భాషాపరమైన సమస్యలను ఎదుర్కొనేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది విద్యార్థులు రాజకీయాల వైపు ఆసక్తి చూపడం లేదని, దేశాభివృద్దిలో రాజకీయ రంగం ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. రాజకీయాలు మంచివి కాదన్న భావన విద్యార్థులు తమ మదిలో నుంచి తొలగించాలని కోరారు. రాజకీయ వేత్తగా, లా మేకర్ గా దేశాభివృద్ధికి ఎంతో చేయవచ్చని, అది ఎంతో సంతృప్తి ఇస్తుందని అన్నారు. కరెంట్ అఫైర్స్, న్యూస్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రాజ్యాంగంలో అలాగే సమాజంలో బలహీనతలు ఉన్నాయని గుర్తిస్తే వాటిని సవరించేందుకు ప్రయత్నించాలని కోరారు. మీరు ప్రస్తుతం ఓటర్లుగా ఉన్నారని, దేశ భవిత మీ చేతుల్లోనే ఉందన్నారు. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.