తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ‘మహాలక్ష్మి స్వశక్తి మహిళ’ పథకాన్ని ప్రారంభించిన సీఎం
హైదరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ‘మహాలక్ష్మి స్వశక్తి మహిళ’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ‘‘మాట తప్పకుండా… మడమ తిప్పకుండా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఏపీలో పార్టీకి తీవ్ర నష్టమని తెలిసినా మనకు రాష్ట్రం ఇచ్చారు. కానీ, కేసీఆర్ పదేళ్లపాటు మహిళలు, ఆడబిడ్డలను పట్టించుకోలేదు. అందుకే మహిళల ఉసురు తగిలి ఆయన పదవి పోయింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే.. కేసీఆర్ కుటుంబానికి కడుపుమంటగా ఉంది. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం వద్దంటూ ఆటో డ్రైవర్లతో ధర్నా చేయించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే రాజీవ్ ఆరోగ్యశ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పథకాన్ని రూ.10లక్షలకు పెంచాం. కేసీఆర్, మోదీ కలిసి రూ.400 ఉన్న గ్యాస్ సిలెండర్‌ను రూ.1200 చేశారు. మహిళలకు భారం కావొద్దని మళ్లీ రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని కేసీఆర్ పదేళ్లు డబ్బా కొట్టారు. పదేళ్లలో ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా 100 మార్కెట్లు నిర్మించి, వారి ఉత్పత్తుల విక్రయం కోసం స్టాళ్లు ఏర్పాటు చేయిస్తామన్నారు. సీఎం కుర్చీలో పాలమూరు బిడ్డ కూర్చుంటే కొందరికి కడుపు మండుతోంది. మహిళలు గెలిపించిన ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కేసీఆర్, నరేంద్ర మోడీ కలిసి కుట్రలు చేస్తున్నారు. రైతుల పంటలు కొనని మోడీకి ఎందుకు ఓటు వేయాలి. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని మోదీ అన్నారు. ఈ పదేళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారా? తెలంగాణ ఏర్పాటును ఆయన ఎన్నోసార్లు అవమానించారు. సోనియాగాంధీ పార్లమెంట్ తలుపులు మూసివేసి తెలంగాణ ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరాలని తలుపులు మూసి బిల్లు పాస్ చేయించారని సీఎం వివరించారు.
మహిళలు తీసుకునే రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
మహిళలకు తమ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తుందని, ఈ రుణాలకు ప్రభుత్వమే వడ్డీని చెల్లిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మహాలక్ష్మి స్వశక్తి మహిళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. 6.10 లక్షల స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. 64 లక్షల మంది మహిళలు లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరగనున్న పార్టీ సీఈసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఓ అభ్యర్థి పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తం ఐదుగురు అభ్యర్థులు ఖరారయ్యారు. మిగతా స్థానాల్లో అభ్యర్థులపై చర్చించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఒకరిద్దరు మంత్రులు వెళ్లే అవకాశముంది. జహీరాబాద్ నుంచి సురేష్ షేట్కార్ , చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, కుందూరు రఘువీర్, మహబూబా బాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ప్రకటించింది. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి పేరును సీఎం ప్రకటించారు.