మల్కాజిగిరి : ప్రధాని నరేంద్ర మోడీ తోనే దేశంలో ప్రశాంతత సాధ్యమైందని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం రాత్రి మల్కాజిగిరి ఆనంద్ బాగ్ బృందావన్ గార్డెన్లో జాతీయ కళాకారుల వేదిక ఆధ్వర్యంలో జరిగిన స్వరరాగ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు మానవ జీవితం కుటుంబంగా ఉండేదన్నారు. ప్రస్తుతం ఇద్దరు ముగ్గురికి కుటుంబం పరిమితమైందన్నారు. పిల్లలు కూడా తల్లి తండ్రులు, గురువుల మాటలు వినే పరిస్థితి లేదకుండా పోయిందన్నారు. పిల్లలు కూడా మందలిస్తే ఆత్మహత్యలకు పాల్పడుతూ కుటుంబానికి శోకాన్ని మిగిలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో డ్రగ్స్ రాజ్యం ఉందన్నారు. ప్రస్తుతం డబ్బు ఉన్నప్పటికీ ప్రశాంత కరువైపోయిందని, సమాజం ఒత్తిళ్ల బారిన పడితే ప్రమాదకరంగా మారుతుందన్నారు. రామాయణం, భారతం మానవ సంబంధాలు సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిందన్నారు. గతంలో మన దేశంపై దాడులు జరిగినప్పుడు సంస్కృతి సాంప్రదాయాలను కోల్పోయామని, వాటిని తిరిగి మోడీ హయాంలో సాధించామన్నారు. అందుకు నిదర్శనం అయోధ్య రామ మందిరం నిర్మాణమేనన్నారు. అమెరికా లాంటి దేశాలు మన ప్రధాని చిన్నచూపు చూసాయని, ప్రస్తుతం ఆదేశాలు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతున్నాయన్నారు. ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన నరేంద్ర మోడీ మరో మారు ప్రధానమంత్రి కావాలంటే ప్రజలు బిజెపిని గెలిపించాలన్నారు. మల్కాజిగిరి ప్రాంతానికి సుపరిచితమైన నన్ను అభ్యర్థిగా ప్రకటించారని, ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ కళాకారులైన డివి మోహన్ కృష్ణ, వినోద్ బాబు తదితరులను ఆయన సన్మానించారు . ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రవణ్ ,సునీత యాదవ్, నిర్వాహకులు చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.