విద్యుత్ వినియోగదారులకు శుభవార్త
గతేడాది వసూలు చేసిన ఛార్జీలే ఈ ఏడాదీ వర్తింపు
వినియోగదారులపై భారం లేకుండా 2024-2025 ఏడాదికి టారిఫ్ రూపకల్పన
సగ్గు బియ్యం తయారీ మిల్లులకు, పౌల్ట్రీ ప్లాంట్లకు కొంతమేర ఉపశమనం
మొత్తం రూ.13,589.18 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి
విజయవాడ : రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి ఛార్జీల భారం లేకుండా కొత్త టారిఫ్ ను రూపొందించడం జరిగిందని ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్‌ను సోమవారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర జలవనరుల నిర్వహణ మరియు రైతుశిక్షణ కేంద్రం నందు జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి మాట్లాడుతూ చట్టప్రకారం టారిఫ్ రూపకల్పన జరిగిందని, ఇందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు, సూచనలు కూడా స్వీకరించామన్నారు. ఇంధన ధరల అంచనాలకు, వాస్తవికతకు తేడా ఉంటుందని, అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వార్షిక ఆదాయ అవసరాల నిమిత్తం ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ డిస్కమ్‌లు రూ.56,573.03 కోట్లకు ప్రతిపాదనలు పంపగా రూ.56,501.81 కోట్లకు కమిషన్ ఆమోదం తెలిపిందన్నారు. వార్షిక ఆదాయ అంతరం నిమిత్తం ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ డిస్కమ్‌లు రూ.13,624.67 కోట్లు ప్రతిపాదించగా రూ.15,299.18 కోట్లకు కమిషన్ ఆమోదించిందన్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఈ మూడు డిస్కమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,589.18 కోట్ల మేర సబ్సిడీ అందించనుందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సబ్సిడీ క్రింద రూ.3,453.96 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుందని తెలిపారు.
రిటైల్ సరఫరా ధరలు
రైల్వే ట్రాక్షన్ కు మినహా మరే ఇతర వర్గానికి ఛార్జీల పెంపు లేదన్నారు. ప్రస్తుత ఏడాది రూ.10,135.22 కోట్ల సబ్సిడీతో పోలిస్తే, రాబోయే సంవత్సరానికి మొత్తం రూ.13,589.18 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో తద్వారా పంపిణీ సంస్థల ఆదాయ లోటును పూడ్చుకోవడానికి మరియు వినియోగదారులపై ఛార్జీలను పెంచాల్సిన అవసరాన్ని నివారించడంలో ప్రభుత్వం ఎంతో సహకరించిందన్నారు. ఈ చర్య వినియోగదారులపై ఆర్థిక భారాన్ని మరింత తగ్గించడానికి సహాయపడుతుందని తెలిపారు. 2020-21 నుండి రైల్వే ట్రాక్షన్ కు టారిఫ్ లో పెంపుదల లేనందున, వాస్తవ సేవా ఖర్చు మరియు ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించేలా ఇంధన ఛార్జీలు యూనిట్ కు రూ.5.50 నుండి రూ.6.50కి పెంచడం జరిగిందన్నారు. అలాగే సగ్గు బియ్యం తయారీ మిల్లులకు, పౌల్ట్రీ ప్లాంట్లకు విద్యుత్ నియంత్రణ కమిషన్ కొంత మేర ఉపశమనం కలిగించిందని, సగ్గు బియ్యం మిల్లులను సీజనల్ పరిశ్రమల విభాగంలో చేర్చడం జరిగిందని పేర్కొన్నారు. పౌల్ట్రీ క్షేత్రాల కార్యకలాపాలకు అనుబంధంగా ఉన్న వారి కార్యాలయం, సిబ్బంది క్వార్టర్స్ వినియోగాన్ని పరిగణించడానికి మొత్తం వినియోగంలో 5 శాతం బిల్లింగ్ వరకు పౌల్ట్రీ కేటగిరి క్రిందనే అనుమతించబడతాయన్నారు. కమిషన్ ప్రకటించిన ఈ వెసులుబాటు వలన విద్యుత్ వాడకం దుర్వినియోగాల కింద డీపీఈ/ విజిలెన్స్ కేసులను బుక్ చేయడం నుండి వారికి ఉపశమనం లభిస్తుందన్నారు. ఏపీటెల్ ఉత్తర్వుల ప్రకారం గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు క్యాప్టివ్ విద్యుత్ కేంద్రాలలో స్థానికంగా ఉన్న లోడ్ వరకు మాత్రమే పరిమితం చేయబడ్డాయన్నారు. విద్యుత్ చట్టం 2003, ఇంధన పరిరక్షణ చట్టం సవరణల ప్రకారం ఏ వినియోగదారుడికి ఎలాంటి అవాంతరాలు లేకుండా నేరుగా డిస్కమ్ నుండి గ్రీన్ ఎనర్జీని సేకరించేందుకు వీలుగా కేటగిరీ టారిఫ్ పై గ్రీన్ టారిఫ్ ప్రీమియం ను, రూ.0.75/యూనిట్ గా నిర్ణయించామన్నారు. విద్యుత్ వాహన ఛార్జింగ్ స్టేషన్లకు, డిస్కమ్‌లు అందించే విద్యుత్ రేటును విద్యుత్ సేవా ఖర్చు (కాస్ట్ ఆఫ్ సర్వీస్) స్థాయికి పెంచాలని డిస్కంలు చేసిన ప్రతిపాదన ఆమోదించలేదని, విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు వాటి టారిఫ్ ను యధాతథంగా డిమాండ్ ఛార్జీలు లేకుండా, యూనిట్ కు రూ.6.70గా నిర్దేశించామని చెప్పారు.
టారిఫ్ ఉత్తర్వులో పంపిణీ సంస్థలకు ఇవ్వబడిన ముఖ్యమైన మార్గదర్శకాలు
ఉచిత వ్యవసాయ విద్యుత్ కేటగిరీ కింద, ఫీడర్ వారీ వ్యవసాయ విక్రయాలను వారి వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలని డిస్కమ్‌లను కమిషన్ ఆదేశించిందన్నారు. వ్యవసాయ వినియోగదారులకు సబ్సీడీ చెల్లింపు ఆలస్యమయ్యే అంశాల్లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ (MOP) జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను డిస్కమ్‌లు అనుసరించాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవించాలని అభ్యర్థించడం జరిగిందని జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామసింగ్, పి.వెంకట రామరెడ్డి, ఏపీజెన్కో ఎండీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, సీపీడీసీఎల్ సీఎండీ కె.సంతోష్ రావు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.