గుంటూరు : ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ సమయంలో నాలుగు సిద్దం సభల ద్వారా జగన్ పార్టీ కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేసారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు సోమవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి వెళ్తున్నారు. కడప కేంద్రంగా కాంగ్రెస్, టీడీపీలో అభ్యర్దుల ఖరారు పైన జరుగుతున్న ప్రచారంతో జగన్ అలర్ట్ అయ్యారు. సీఎం జగన్ మరోసారి పులివెందుల నుంచి పోటీ చేయనున్నారు. అందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ సమయంలో సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం లో జగన్ పాల్గొంటారు. డాక్టర్ వైయస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రారంభిస్తారు. తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైయస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైయస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారైంది. గాంధీ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్ వైయస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు. తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయ చేరుకుంటారు. వైయస్ఆర్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైయస్ఆర్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. ఈ సమయంలో జగన్ కడప జిల్లాలో అభ్యర్దులు ఎన్నికల సమాయత్తం పైన పార్టీ నేతలు దిశా నిర్దేశం చేయనున్నారు.
మేనిఫెస్టో హామీలపై ఉత్కంఠ : రైతురుణామఫీ పైన ప్రకటన ఉంటుందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే రైతు భరోసా పెంచితే రుణమాఫీ అమలు ఉండటం సాధ్యమేనా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ రూ 3 వేల నుంచి రూ 4 వేలకు నాలుగు విడతలుగా పెంచేలా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పొదుపు సంఘాల మహిళలకు ప్రస్తుత హాయంలో రుణ మాఫీ చేయటంతో వారికి ఆర్దికంగా ప్రయోజనం కలిగే హామీలను ప్రకటిస్తారని చెబుతున్నారు. ప్రస్తుత హామీలు కొనసాగిస్తూనే కొత్తవి ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. దీంతో జగన్ మేనిఫెస్టో ప్రకటన పైన ఇప్పుడు వైసీపీతో పాటుగా రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది.