1,09,400 మంది రోగులకు ఇంటి వద్దకే నాణ్యమైన ఔషధాల పంపిణీ
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంతో జగనన్న ఆరోగ్య సురక్ష అనుసంధానం
మరింత మెరుగైన ఫలితాల దిశగా పటిష్టంగా జెఎఎస్ అమలు
ప్రతి వ్యక్తికీ ఆరోగ్య సంరక్షణ అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తపన
అమరావతి: ప్రజలకు తమ గ్రామ/వార్డు సచివాలయాలలో నాణ్యమైన వైద్యం అందించాలనే గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎయస్) కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.
ఏ గ్రామాన్నీ వదిలిపెట్టకుండా, ఏ వ్యక్తినీ ఆరోగ్య సేవలకు దూరం కానీయకుండా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వ్యక్తికీ ఆరోగ్య సంరక్షణ అందించాలనే గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గత 5 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతల్లో వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తోంది. మొదటి విడతలో మొత్తం 60.28 లక్షల మంది ప్రజలు తమ సొంత గ్రామాలు, వార్డులలో వైద్య నిపుణుల నుంచి నాణ్యమైన వైద్య సేవలను పొందారు. ఈ శిబిరాల వల్ల ప్రజలు పెద్ద ఆసుపత్రులకు వెళ్లడానికి, నిపుణులను సంప్రదించడానికి తమ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోకుండానే నాణ్యమైన వైద్య సేవలను పొందుతున్నారు.
జేఏఎస్ -I కింద ఆరోగ్య సిబ్బంది మొత్తం 1.45 కోట్ల ఇళ్లకు వెళ్లి, ఏడు కేటగిరీలలో ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఇళ్లల్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం కోసం ఇళ్ల వద్దనే రికార్డు స్థాయిలో 6.45 కోట్ల పరీక్షలు నిర్వహించారు. ఈ హెల్త్ ప్రొఫైల్ భవిష్యత్‌లో చేపట్టబోయే వైద్య కార్యక్రమాలు, ప్రణాళికకు, లక్ష్యాలు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మొత్తం 1,66,828 మంది రోగులను ఉన్నత కేంద్రాల్లో తదుపరి చికిత్స కోసం రెఫర్ చేయగా వారందరికీ తగిన చికిత్సను అందించారు. 80,115 మంది రోగులు కంటిశుక్లం శస్త్రచికిత్సలు లేదా సంబంధిత కంటి సంరక్షణ చికిత్సను పొందారు. అదేవిధంగా, మరో 86,713 మంది రోగులకు ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్డ్ నెట్వర్క్ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులలో రెఫరల్ చికిత్స అందింది. ఈ రెఫరల్ చికిత్సలను సీహెచ్‌ఓలు, ఏఎన్ఎమ్లు, ఆరోగ్యమిత్రలే దగ్గరుండి జరిగేలా చూస్తున్నారు. జేఏఎస్ -1 శిబిరాలను సందర్శించిన రోగులకు కంటిలో రిఫ్రాక్టివ్ లోపాలను నిర్ధారించే పరీక్షలు చేయగా, 5,73,545 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.
బీపీతో బాధపడుతున్న 2,51,529 కొత్త కేసులను గుర్తించిన విషయం చాలా ముఖ్యమైనది. అలాగే కొత్తగా 1,54,248 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులను కూడా గుర్తించారు. వీరికి చికిత్స అందించడమే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం లో భాగంగా ఫ్యామిలీ డాక్టర్లు తదుపరి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. జేఏఎస్- I క్యాంపులు నిర్వహించకపోతే, ఈ కొత్త కేసులకు సకాలంలో చికిత్స అందక, త్వరలోనే అవి దీర్ఘకాలిక వ్యాధులుగా మారే ప్రమాదమేర్పడేది.
జేఏఎస్- II కింద, 07.03.2024 నాటికి మొత్తం 27,33,076 మంది రోగులు శిబిరాలకు హాజరు కాగా, వీరిలో 12,01,859 మంది ప్రత్యేక రోగులుగా ఈ జేఏఎస్ -II శిబిరాల్లో మొదటిసారిగా గుర్తించారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఎంతగానో వినియోగించుకుంటున్నారు. వారికి ఎంతగా చేరువైంది అన్నదానికి ఇది నిదర్శనం. మొత్తం 12,837 మందిని తదుపరి చికిత్స కోసం రెఫర్ చేయగా, వారిలో 4,609 మందిని ఎప్పటికప్పుడు ఫాలో-అప్ చేస్తూ చికిత్స అందించారు. కంటిశుక్లం శస్త్రచికిత్సల కోసం 2,313 మందిని గుర్తించగా, వారిలో 1,740 మందికి ఇప్పటికే శస్త్రచికిత్సల్ని చేశారు. జేఏఎస్- II కింద, 1,67,750 మంది రోగులకు కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. అలానే 1,62,000 మంది రోగులకు కళ్లద్దాలను పంపించగా, వారిలో 57,000 మంది వాటిని అందుకున్నారు.
కొన్ని సందర్భాలలో, మరింత స్పష్టమైన నిర్ధారణ కోసం, అలానే హై రేంజ్ ఔషధాల కోసం ఉన్నత వైద్య కేంద్రాలో నిపుణులను సంప్రదించాలని రెఫర్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా, ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కావడం, తీసుకున్న చొరవ వల్ల గ్రామ/వార్డు స్థాయిలో మధుమేహ పరీక్షలలో కీలకమైన హెచ్‌బీఏ1సి
వంటి నిర్ధారణ పరీక్షలను నిర్వహించగలుగుతోంది, వారి ఇంటికి వెళ్లి రక్తం నమూనాలను సేకరించి తదుపరి చికిత్సను ప్రభుత్వం అందిస్తుంది. మరోవైపు, దీర్ఘకాలిక చికిత్స అవసరమయ్యే ప్రత్యేక కేటగిరీ రోగులకు ప్రభుత్వం దీర్ఘకాలిక ఔషధ సరఫరాను కూడా ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తమ ఇంటికే ఖరీదైన మందులు ఉచితంగా పంపిణీ చేయడం పట్ల రోగులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు వరకు, మొత్తం 1,09,400 మంది రోగులకు వారి ఇంటి వద్దకే హై రేంజ్ ఔషధాలు పంపిణీ అయ్యాయి. సీహెచ్‌ఓలు ఔషధ మోతాదును వివరిస్తూ, తదుపరి పరిస్థితిని ఫాలో అప్ చేస్తున్నారు. గ్రామ స్థాయిలో నిర్ధారిత రోగనిర్ధారణ పరీక్షలను అందించడం వలన, అలానే గ్రామ స్థాయిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందులు, కన్సల్టేషన్ సదుపాయం కల్పించడం వల్ల, జేఏఎస్ -IIలో రెఫరల్ కేసులు తగ్గాయి. జేఏఎస్- I క్యాంపులు నిర్వహించిన 3 నెలల వ్యవధిలోనే జేఏఎస్- II క్యాంపులు జరుగుతున్నాయి. ఈ కారణంగా గ్రామ స్థాయి సమగ్ర స్క్రీనింగ్ కేవలం 3 నెలల ముందు మాత్రమే చేయడం వలన గ్రామంలో రెఫరల్ కేసుల అవసరం తగ్గింది.
జేఏఎస్ -II కింద, ఒక మండలంలో వారంలో ఒక్కసారి మాత్రమే గ్రామ స్థాయిలో ఒక శిబిరాన్ని నిర్వహిస్తారు. ఇది ఆరోగ్య కేంద్రాలలో సేవలపై ఏ రూపంలోనూ ప్రతికూల ప్రభావాన్ని చూపదు. అదే విధంగా పట్టణ ప్రాంతాలలో కూడా ఒక రోజు మాత్రమే శిబిరాలు నిర్వహిస్తారు.
వాలంటీర్లు క్యాంపు షెడ్యూల్‌కు 15 రోజుల ముందుగానే ప్రతి ఇంటినీ సందర్శిస్తున్నారు, అలానే రోగులను జేఏఎస్ క్యాంపులకు తీసుకెళ్లడానికి, శిబిరం గురించి అవగాహన కల్పించడానికి షెడ్యూల్ చేసిన తేదీకి మూడు రోజుల ముందు రెండవసారి సందర్శిస్తున్నారు.
జేఏఎస్ఐ క్యాంపుల్లో పాల్గొన్న వైద్యులకు గౌరవభృతిని చెల్లించేందుకు జిల్లా కలెక్టర్ల ఖాతాలకు ప్రభుత్వం ఇప్పటికే నిధులను విడుదల చేసింది.