ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
శిక్షణ పూర్తి చేసి ఉపాధి పొందిన యువతతో ‘గ్రాడ్యుయేషన్ సెర్మనీ’
ముఖ్యమంత్రి సమక్షంలో కీలక సంస్థలతో ‘నైపుణ్య ఒప్పందాలు’
అమరావతి : సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ‘స్కిల్ కాస్కేడింగ్ వ్యవస్థ’ సరికొత్త ఆవిష్కరణ జరగనున్నట్లు ఆర్థిక,నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ‘భవిత’ పేరుతో ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగా 192 స్కిల్ సెంటర్లు, 26 స్కిల్ కాలేజీలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మంగళవారం ముఖ్యమంత్రి సమక్షంలో పలు కీలక సంస్థలతో నైపుణ్య శిక్షణకు సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఇప్పటికే 152 పారిశ్రామిక భాగస్వామ్యులు, విద్యా సంస్థలు, సామాజిక వ్యవస్థలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను నాలెడ్జ్ పార్ట్ నర్లుగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. మార్కెట్ లో ఉద్యోగవాకాశాలను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. 2023-24 సంవత్సరంలో నైపుణ్య శిక్షణను పూర్తి చేసుకుని ఉద్యోగావకాశాలు పొందిన యువతతో ‘గ్యాడ్యుయేషన్ సెర్మనీ’ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఒక్కోటి రూ.70 లక్షలతో ఏర్పాటు చేసిన 10 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను సీఎం ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రంలో రూ.90 కోట్లతో అభివృద్ధి చేసిన 43 ప్రభుత్వ పాలిటెక్నిక్, 22 ఐటీఐ కళాశాలలను ముఖ్యమంత్రి విశాఖ నుంచి వర్చువల్ గా ప్రారంభిస్తారని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. స్కిల్ ఎకో సిస్టమ్ కు సంబంధించిన లోగో, స్కిల్ గీతాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారన్నారు. ఏపీ స్కిల్ యూనివర్స్ యాప్ ను కూడా సీఎం ప్రారంభిస్తారని మంత్రి బుగ్గన తెలిపారు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని విభిన్న రంగాల్లో యువత రాణించే విధంగా నైపుణ్య శిక్షణ అందించడం కోసం ఉపాధి అవకాశాలు లేని జిల్లాలపై దృష్టి సారించి ఉద్యోగ అవకాశాలకు వ్యూహ రచన చేసినట్లు మంత్రి తెలిపారు.