రూ.6 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన నరేంద్ర మోడీ
కాళేశ్వరం విషయంలో భారాసతో కాంగ్రెస్ కుమ్మక్కు
ఆదిలాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
ఆదిలాబాద్ : తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో వర్చువల్ విధానంలో రూ.6 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం రేవంత్‌కు సంపూర్ణంగా సహకరిస్తాం. తెలంగాణలో గడిచిన పదేళ్లలో రూ.56 వేల కోట్లకుపైగా పనులు ప్రారంభించాం. అభివృద్ధిలో కొత్త అధ్యయనాన్ని లిఖించామని అన్నారు. అంబారీ – ఆదిలాబాద్ – పింపాలకుట్టీ రైల్వే విద్యుద్దీకరణను జాతికి అంకితం చేశారు. మంచిర్యాల జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ రెండో థర్మల్ పవర్ యూనిట్‌ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, సీఎం రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో రేవంత్‌కు పూర్తి సహకారం : వికసిత్ భారత్ కోసం తమ పార్టీ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు. ఇది ఎన్నికల సభ కాదని, అభివృద్ధి ఉత్సవమని చెప్పారు. 15 రోజుల్లో 5 ఎయిమ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామన్నారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవాలన్నారు. కాంగ్రెస్, భారాసపై ఈ సందర్భంగా మోడీ పలు విమర్శలు చేశారు. ‘‘భారాస ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగింది. ఈ విషయంలో ఆ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతోంది. గతంలో మీరు తిన్నారు. ఇప్పుడు మేం తింటాం అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. భారాస పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదు. రాష్ట్రంలో సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాం. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. ప్రజల కలల సాకారం కోసం నేను పనిచేస్తా. మోడీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ. దేశంలో 7 మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని, అందులో ఒకటి తెలంగాణలో పెడతామని నరేంద్ర మోడీ అన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదిలాబాద్‌లో రూ.7వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో పాటు రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించారు. దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని, తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయిందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారని నరేంద్ర మోడీ అన్నారు.