విజయవాడ : ఉన్నత విద్యావంతులు కావాలని కోరుకునే ప్రతి విద్యార్థులకూ ఇగ్నో చేరువలో ఉంటుందని అలాంటి అవకాశాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వైస్ ఛాన్సులర్ ఫ్రొఫెసర్ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇగ్నో లో ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలిపారు.ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రానికి సంబంధించి అమరావతి పరిధి లోని రాయపూడి లో జరుగుతున్న శాశ్వత భవన నిర్మాణాలను శనివారం స్వయంగా ఇగ్నో మరియు కేంద్ర ప్రజా పనుల శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడుతూ పల్నాడు, బాపట్ల, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలలో త్వరలో నూతన అధ్యయన కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో మరిన్ని కొత్త కోర్సులను ఆయ అధ్యయన కేంద్రాలలో ప్రవేశ పెట్టనున్నట్లు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసేందుకు దూరవిద్యతో పాటు ఆన్ లైన్ కోర్సులను కూడా అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కేంద్ర సంచాలకులు డాక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ తో పాటు డాక్టర్ సుమలత, ప్రసాద్ బాబు, బాల చందర్, ఉదయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.