సీపీఐ, సీపియం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసరావును కలిసి విన్నవించిన ఏ.పి.యు.డబ్ల్యు.జే నేతలు
విజయవాడ : రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని, అందుకోసం జర్నలిస్ట్ మానిఫెస్టో ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏ.పి.యు. డబ్ల్యు.జే.) నేతలు శనివారం సీపీఐ , సీపీయం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి. శ్రీ నివాసరావులను కల్సి విజ్ఞప్తి చేశారు. ఆమేరకు ఏ.పి.యు.డబ్ల్యు.జే. రూపొందించిన 15 అంశాలతో కూడిన “జర్నలిస్ట్ మానిఫెస్టో” ను వారికి అందచేశారు. అక్రెడిటేషన్ నిబంధనలను సరళతరం చేయాలని, గతంలో అమల్లో ఉన్న హెల్త్ కార్డుల పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ప్రమాద బీమా పథకం తిరిగి ప్రవేశ పెట్టాలని, ఇళ్ళస్థలాల జీవోను మార్చి సీనియారిటీ ప్రాతిపదికన నామ మాత్రపు ధరకు స్థలాలు ఇవ్వాలని, గతంలో ఉన్న ప్రొఫెషనల్ కమిటీలను తిరిగి ఏర్పాటు చేయాలని , సంక్షేమ నిధిని పునరుద్ధరించాలని , ప్రెస్ అకాడమీకి నిధులు ఇచ్చి పనిచేయించాలని , రైల్వే ప్రయాణ రాయితీని కొనసాగించాలని, పాత్రికేయులకు పింఛను ఇవ్వాలని , ఉత్తమ జర్నలిస్ట్ ల అవార్డులను తిరిగి ప్రారంభించాలని యూనియన్ నేతలు కోరారు.రాజకీయ పార్టీలన్నీ తమ ఎన్నికల ప్రణాళికల్లో జర్నలిస్ట్ మానిఫెస్టో ను కూడా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్, కార్యవర్గ సభ్యులు చావా రవి, సామ్నా రాష్ట్ర ప్రధానకార్యదర్శి సి హెచ్ .రమణారెడ్డి,ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు షేక్ బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దారం వెంకటేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి డి. నాగరాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.