ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్రెడ్డి హామీ
హైదరాబాద్ : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్ట్ లు అందరికి ఇంటి స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ (జేఎన్జే)కి సంబంధించి ఇళ్ల స్థలాల అప్పగింతపై రాష్ట్ర రెవిన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డితో జేఎన్జే ప్రతినిధులు చర్చించి ఒక రోడ్డుమ్యాప్తో తన దగ్గరకు వస్తే ఒక్క నిమిషంలో సంబంధిత ఫైలుపై సంతకం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఏ సంస్థకు నామినేటెడ్ ఛైర్మన్ నియమించకుండా కేవలం మీడియా అకాడమీకే శ్రీనివాస రెడ్డిని ఛైర్మన్గా నియమించానంటే తమ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టమవుతోందని అన్నారు. జేఎన్జేలో సభ్యులైన అన్ని పత్రికల, టీవీ మీడియాకు చెందిన ప్రధాన ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కల్సి జేఎన్జేకు కేటాయించిన ఇళ్ల స్థలాల అప్పగింత ప్రక్రియ వంద రోజుల్లోగా మొదలుపెడతానన్న హమీ ని అమలు చేసినందుకు కృతఙ్ఞతలు తెలిపారు.
సొసైటీ ప్రస్థానం గురించి జేఎన్జే ప్రతినిధులు వివరిస్తూ 16 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వమే నిజాంపేట, పేట్ బషీర్బాద్లో 70 ఎకరాల స్థలాన్ని జేఎన్జేకు కేటాయించిదని సీఎంకు తెలిపారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సొసైటీకి స్థలాన్ని అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా గత ప్రభుత్వంలో ఈ తీర్పు అమలుకాలేదని, ఇప్పటి వరకు ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చామని వారు వివరించారు. ఈ సొసైటీలోని 60 మంది సభ్యులు ఇప్పటికే మరణించారని, మరో 20 మంది సభ్యుల ఆరోగ్య పరిస్థితి బాలేదని ఆయన సీఎంకు వివరించారు. సొసైటీ సభ్యులు మరణించడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే సొసైటీ లో తానూ సభ్యుడినని డెవలప్మెంట్ కోసం 10 లక్షలు చెల్లించానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన మిగిలిన జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇచ్చే విషయంలో కూడా మీడియా అకాడామీతో చర్చించి కార్యాచరణను రూపొందిస్తే వారికి కూడా స్థలాలను ఇస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఆరోగ్యభద్రతా కార్డులతోపాటు ఇతర సమస్యలపై కూడా దృష్టిసారించామని తెలిపారు. ఈ సమావేశంలో ఉన్న రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.