రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
వెలగపూడి : రాష్ట్రంలో ఎక్కడా కలుషిత నీరు, పారిశుధ్యం లోపం వంటి కారణాలతో డయేరియా వంటి అంటువ్యాధులు ప్రభలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఇటీవల గుంటూరు నగరంలో ప్రబలిన డయేరియా తదనంతరం తీసుకున్న చర్యలపై శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో అంటువ్యాధులు ప్రభలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు.
రానున్న మూడు మాసాలు అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల్లో తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ డయేరియా వంటి అంటు వ్యాధులు ప్రభలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు గాను గ్రామ వార్డు సచివాలయాలను పూర్తి స్థాయిలో సన్నద్దం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ఇటీవల గుంటూరులో ప్రభలిన డయేరియా నియంత్రణకు తీసుకుంటున్నచర్యలను సమీక్షించారు.డ్రైన్ల మీదగా వెళ్లే తాగునీటి పైపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి లీకేజిలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.ఇంకా ఇందుకు సంబంధించి పలు అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈసమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ జె.నివాస్, సిడిఎంఏ శ్రీకేష్ బాలాజీ, వర్చువల్ గా గుంటురు జిల్లా కలక్టర్ వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.