కాలేజీల్లో ఫీజులు కట్టించే గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం
మన ప్రభుత్వంలో విద్య కోసమే రూ.73 వేల కోట్లు
పామర్రులో అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికం విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్
రాష్ట్రంలో 9.45 లక్షల మంది విద్యార్థుల్లో 93 శాతం మందికి విద్యా దీవెన
రూ.708 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
వసతి దీవెన కింద ఏప్రిల్ లో మరో రూ.1,100 కోట్లు విడుదల
పామర్రు : జగనన్న విద్యా దీవెన పథకం అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికం నిధులను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చదువుకుంటున్న 9.45 లక్షల మంది పిల్లల్లో 93 శాతం మంది విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ వివరించారు. అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికానికి సంబంధించి రూ.708 కోట్లు విడుదల చేశామని చెప్పారు. గత 57 నెలల కాలంలో విద్యా దీవెన రూపంలో రూ.12,609 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. వసతి దీవెన ద్వారా ఇప్పటిదాకా రూ.4,275 కోట్లు చెల్లించామని తెలిపారు. వసతి దీవెన కింద ఏప్రిల్ లో మరో రూ.1,100 కోట్లు విడుదల చేయనున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డిపేర్కొన్నారు.
పేదరికం సంకెళ్లు తెంపే కార్యక్రమం : ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం, తరతరాల పేదరికం సంకెళ్లను తెంపేసి, చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు పామర్రు నుంచి జరుగుతోందన్నారు. పెద్ద చదువులు చదువుకుంటున్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, పూర్తి డబ్బు మొత్తాన్ని వంద శాతం ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చి, తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ కొనసాగిస్తూ వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతున్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజును మీ జగనన్న ప్రభుత్వమే కడుతోందన్నారు.
ఆదాయ పరిమితినీ పెంచాం : మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలను చదివించాలి, వారు బాగుపడాలి, ఏ పేదవాడూ తన పిల్లల చదువుల కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని, మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం. ఆదాయ పరిమితిని పెంచాం. గతంలో లక్ష రూపాయలకు పరిమితమైన ఆదాయ పరిమితిని ఎస్సీలకు 2 లక్షల దాకా పరిమితమై ఉండేది. మనం వచ్చిన తర్వాత ఏకంగా 2.5 లక్షలకు పెంచి ఈరోజు 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలిగాం. ఫీజులు కూడా గతంలో మాదిరిగా ఇంతే కడతాం, ఇంత కన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి, మీ చావు మీరు చావడం అనే విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పాం. పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులూ ఇబ్బంది పడే పరిస్థితి రావద్దని పూర్తి ఫీజును కట్టే కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకున్నామన్నారు. పిల్లలు ఇబ్బంది పడకూడదని ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే తల్లులకు ఫీజులు వేస్తూ కాలేజీల్లో ఫీజులు కట్టించే గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం. పిల్లలకు పూర్తి ఫీజులు చెల్లించే విద్యాదీవనే కాకుండా పిల్లలు ఇబ్బంది పడకూడదని, జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి పాపకూ, బాబుకూ తల్లిదండ్రులకు మంచి చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా జరిపిస్తున్నామని చెప్పారు.
తల్లుల జాయింట్ అకౌంటుకు ఏకంగా రూ. 708 కోట్లు : అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి పిల్లలకు ఖర్చు అయ్యే పూర్తి ఫీజు రీయింబ్స్ మెంట్ను 9.45 లక్షల మందికి మేలు చేస్తూ నేరుగా బటన్ నొక్కి పిల్లల, తల్లుల జాయింట్ అకౌంటుకు ఏకంగా రూ. 708 కోట్లు నేరుగా పంపించడం జరుగుతుంది. ఈ రూ.708 కోట్లతో కలుపుకొని 57 నెలల కాలంలో మీ అన్న ప్రభుత్వం చెల్లించిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తీసుకుంటే ఏకంగా 29.66 లక్షల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ జగనన్న విద్యాదీవెన అనే ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే రూ.12,609 కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు జమ చేయడం జరిగిందన్నారు. జూలై నుంచి జూన్ దాకా ఉండే విద్యాసంవత్సరం మొదట్లో, చివర్లోనూ ప్రతి ఏప్రిల్ లో ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా భోజన, వసతి కోసం చెల్లించిన మొత్తం మరో రూ.4275 కోట్లు. ఈ ఏప్రిల్ లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో రూ.1100 కోట్లు కలుపుకుంటే విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు పెట్టిన డబ్బు ఏకంగా రూ.18 వేల కోట్లు అన్నారు. ఇలా కేవలం పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు బాగుపడాలి, కుటుంబాలు బాగుపడాలి, పిల్లలకు మంచి జరగాలని ప్రతి అడుగూ వేస్తూ వచ్చాం. మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు.
మన ప్రభుత్వంలో విద్య కోసమే రూ.73 వేల కోట్లు : ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాల మీద 57 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే రూ.73 వేల కోట్లు చేశాం. గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకు ఇచ్చే జీతాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలని, కేవలం పథకాల మీద ఖర్చు చేసిన సొమ్ము ఈ 73 వేల కోట్లు. ఇది పేద, మధ్య తరగతి కుటుంబాల మెరుగైన జీవితం కోసం మనం చేసిన హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ అన్నారు. పేద కుటుంబాల్లో ప్రతి పాపా, ప్రతి బాబూ గొప్ప చదువులతో గొప్ప డిగ్రీలతో ఇంజనీర్లుగానూ, కలెక్టర్లుగానూ, డాక్టర్లుగానూ, పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈవోలుగానూ వారంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆ కుటుంబాల తలరాతలన్నీ మారాలని, భవిష్యత్ బాగుండాలని అడుగులు వేస్తూ వచ్చామన్నారు.