15 లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు
అన్నివర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ
త్వరలో పార్టీ మేనిఫెస్టో విడుదల
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి. విజయసాయి రెడ్డి
బాపట్ల : బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద మార్చి 3 న నిర్వహించ తలపెట్టిన సిద్ధం మహాసభ స్వల్ప మార్పు చేసి మార్చి 10న నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల, పిచ్చుకుల గిడిపాడు జాతీయ రహదారి పక్కన సిద్దం సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్య నాయకులతో కలసి బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద సుమారు 98 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఈ సభకు వచ్చేందుకు ఇప్పటికే 7 లక్షలకు పైగా సంసిద్ధత వ్యక్తం చేశారని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పార్టీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోందని, సభా ప్రాంగణం వద్ద అన్ని కనీస వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గతంలో నిర్వహించిన భీమిలి, ఏలూరు, రాప్తాడు సిద్ధం సభలు పెద్ద ఎత్తున విజయవంతం అయ్యాయని, ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.
ఈ మేరకు ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న చివరి సిద్ధం మహాసభ మరింత విజయవతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పాలనతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్ర వర్ణాలకు చెందిన పేదలు వైఎస్సార్సీపీని ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ, ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలన అందించిందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, సంక్షేమ పథకాలపై ప్రజలకు, కేడర్ కు సిద్ధం సభలో సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని, సభ సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. మార్చి 13, 14 తేదీల్లో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉందని, పార్టీకి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూస్తే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు సాధిస్తామన్న ధీమా మరింత బలపడుతుందన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోందని అతి త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. అలాగే చివరి సిద్ధం సభకు ముందే అన్ని సీట్లు ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా ప్రజలు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపిలు మోపిదేవి వెంకట రమణ, నందిగం సురేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు బూచేపల్లి శివ ప్రసాద రెడ్డి, కరణం వెంకటేష్, హనిమిరెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.