ఉపాధ్యాయుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
సరిపడా అదనపు పోస్టులు క్రియేట్ చేసి ఉద్యోగాలు కల్పించాలి
ఎన్నికల నోటిఫికేషన్ లోపు కారుణ్య నియమాకాల ఉత్తర్వులు జారీ చేయాలి
ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తూ చనిపోయిన వందలాది మంది ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయ కుటుంబాల్లో అర్హత కలిగిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే ప్రభుత్వం కారుణ్య నియామాకాలు చేపట్టాలని ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జిల్లాపరిషత్ పరిధిలో కారుణ్య నియామాకాలు వెంటనే చేపట్టి ఉపాధ్యాయుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిషత్ టీచర్లు, హెడ్ మాస్టర్లు కోవిడ్ ముందు, కోవిడ్ సమయం లోను, తర్వాత అనేక మంది చనిపోయినప్పటికి, లోకల్ బాడీస్ లో పనిచేసిన ఉద్యోగులకు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం అనుమతి లేదన్నారు. గత ఆరు, ఏడు సంవత్సరాలు గడుస్తున్నా సరే సరిపడా ఖాళీలు లేనందున వారందరికీ ఎలాంటి కారుణ్య నియామకాలు నేటికీ చేపట్టనందున, ఆ కుటుంబాలు తీవ్ర ఆర్దిక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని నిభందనల మేరకు వీరందరికీ జిల్లాపరిషత్ పరిధిలోనే వన్ టైం సెటిల్మెంట్ క్రింద అవసరమైతే సరిపడా అదనపు పోస్టులు క్రియేట్ చేసి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఇతర లోకల్ బాడీస్ కార్యాలయాల్లోనూ, వారి అర్హతలను బట్టి గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఏపీ జేఏసీ అమరావతి పక్షాన గత అనేక సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరినా నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర రావు అన్నారు.
ఏపీ జేఏసీ అమరావతి ఆద్వర్యంలో గత సంవత్సరం ఫిబ్రవరిలో 92 రోజులు ఉద్యమం చేసినప్పుడు విజ్ఞప్తులు చేయడమే కాకుండా, తదుపరి ఈమధ్య కాలంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలసి లేఖలు ఇస్తూ విజ్ఞప్తులు చేయడమే కాకుండా ఈనెల 12 , 23 తేదీల్లో జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం చర్చల్లో జాయింటు స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించగా మంత్రివర్గ సభ్యులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. జిల్లా పరిషత్ పరిధిలో ఉద్యోగులు, ఉపాద్యాయులు చనిపోయి ఆరు ఏడు సంవత్సరాలు దాటినందున, వారి కుటుంబాల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నందున, వారందరి కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదన్నారు. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా, ప్రభుత్వం వన్ టైమ్ మెజర్ క్రింద ఈ కుటుంబాలలో అర్హత కలిగిన కుటుంబ సభ్యులను ఆదుకుని ఎన్నికల నోటిఫికేషన్ లోపు కారుణ్య నియమాకాలు ఉత్తర్వులు జారీ చేయాలని ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర కమిటీ పక్షాన ఏపిజేఏసి చైర్మన్ బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణి పేర్రాజు, కోశాధికారి వి.వి.మురళి కృష్టనాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.