రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
వైఎస్సార్ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్
53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి
10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ
57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి
వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
గుంటూరు : వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేశారు. రబీ 2021-22, ఖరీఫ్-2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని బుధవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నాం. మొత్తం 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,078.36 కోట్లు జమ. కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూముల సాగు రైతులకు సాయం. 57 నెల్లలో రైతు భరోసా కింద అందించిన మొత్తం రూ.34,288 కోట్లు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఒక్కో రైతన్నకు అదనంగా రూ.17,500 ఇస్తున్నామన్నారు.
రైతు ప్రభుత్వం మనది : మన ప్రభుత్వం వేసిన ప్రతీ అడుగూ కూడా రైతులు, రైతు కూలీలు బాగుండాలని వేశాం. క్రమం తప్పకుండా వైయస్సార్ రైతు భరోసా కింద సహాయాన్ని అందించాం. పెట్టుబడి సహాయంగా, రైతన్నకు దన్నుగా ఇది అందించాం. రాష్ట్రంలో దాదాపు 50శాతం లోపు రైతులన్నకున్న భూమి అర హెక్టారు లోపలే. హెక్టారు లోపల ఉన్న రైతులు 70 శాతం ఉన్నారు. ఈ పెట్టుబడి సహాయం వారికి ఎంతో మేలు చేసింది. వంద శాతం రైతులకు 80శాతం ఖర్చు రైతు భరోసా కింద కవర్ అయ్యిందన్నారు. పేద రైతుల పక్షపాత ప్రభుత్వం మనది, దీనికి నేను గర్వపడుతున్నాను. సున్నా వడ్డీ కింద కూడా రూ.215.98 కోట్లు విడుదల చేస్తున్నాం. రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా కట్టే రైతులకు మేలు చేస్తున్నాం.ఇప్పటివరకూ 84.66 లక్షల మంది రైతన్నలకు ఇప్పటి వరకూ అందించిన వడ్డీ రాయితీ 2,050 కోట్లు. మొత్తంగా రైతు భరోసా, సున్నా వడ్డీ కింద రైతులకు ఇవాళ విడుదలచేస్తున్న మొత్తం రూ.1,294.38 కోట్లు అందించామన్నారు.
ప్రతీ అడుగులోనూ రైతన్నలకు తోడు : ప్రతీ అడుగులోనూ రైతన్నలకు తోడుగా నిలుస్తున్నాం. ప్రతీ పథకం దాదాపుగా పేద రైతు కుటుంబానికి అందుబాటులో ఉంచడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఏడాదికి రూ.12500 బదులు వేయి పెంచి రూ.13500 ఇచ్చాం. 50వేల స్థానంలో ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చాం. చెప్పినదానికంటే ఎక్కువగా ఇచ్చిన ప్రభుత్వం మనది. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదేళ్లలో ముందుకు సాగాము. ప్రతీ సందర్భంలోనూ వారికి తోడుగా నిలిచామన్నారు.
రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ : 19 లక్షల మంది రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ కింద ప్రతి రైతుకు రూ.45వేల మేర మేలు జరుగుతుంది. ఏడాదికి దాదాపుగా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతుల తరఫున ఉచిత పంటల బీమాకు ప్రీమియం కడుతున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం మనది. గతంలో ఎప్పుడూ కూడా రైతుల తరఫున ఎప్పుడూ బీమా ప్రీమియం చెల్లించలేదు. దేశంలో కూడా ఎక్కడా లేదు. రైతులకు ఎక్కడ కష్టం వచ్చినా ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. కేవలం ఈ ఐదేళ్లలో మాత్రమే ఇలా జరిగింది. ఇదొక విప్లవాత్మక మార్పు. నష్టం నుంచి రైతు తట్టుకుని నిలబడి తిరిగి పంటలు వేసుకునే పరిస్థితి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక చర్యగా దీన్ని అమలు చేసిందన్నారు.
ఆక్వా రైతులకు సాయం : గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను పెట్టాం. అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను రైతుకోసం పెట్టాం. రైతులకు ఇ-క్రాప్ చేస్తూ అన్నిరకాలుగా ఆదుకుంటున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ కూడా రైతులను చేయిపట్టుకుని నడిపించాం. ఈ ఐదేళ్లకాలంలో మాత్రమే ఇలా జరిగింది. ఆక్వా రైతులకు రూ.1.5కే కరెంటు ఇస్తూ ఆదుకున్నాం. ఆక్వాజోన్లలో ఉన్న ఆక్వారైతులకు తోడుగా నిలిచాం. పాల సేకరణలో కూడా రైతులకు తోడుగా నిలిచాం. రూ.10-20ల వరకూ రైతులకు అధిక ధరలు వచ్చాయి. పాలసేకరణలో ఈ ఐదేళ్ల కాలంలోనే రైతులకు రేట్లు పెరిగాయి. సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన అమూల్‌ను తీసుకు వచ్చి ఈ రంగంలో పోటీని పెంచాం. తద్వారా రైతులకు మేలు జరిగిందన్నారు.
భూ వివాదాలకు చెక్‌పడుతూ సమగ్ర సర్వే : 100 సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగింది. అప్పటినుంచి రికార్డులు అప్డేట్ కాకపోవడం, సబ్ డివిజన్లు జరక్కపోవడం జరిగింది. వివాదాలకు చెక్‌పడుతూ సమగ్ర సర్వే చేపట్టాం. రికార్డులను అప్డేట్ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవలను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం. 34.77 లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులను రైతులకు, పేదలకు కల్పించాం. ఈ ఐదేళ్ల కాలానికి తేడా గమనించాలని కోరుతున్నాను. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీచేస్తామని చంద్రబాబు చెప్పారు. బ్యాంకుల్లో బంగారం రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలన్నారు. దీంతో రైతులు నమ్మి అధికారం ఇస్తే దారుణంగా మోసం చేశారన్నారు. మనం ఈ ఐదేళ్లలో వైయస్సార్ రైతు భరోసా కింద రూ.34వేల కోట్లు ఇచ్చాం. ధాన్యం కొనుగోలుకోసం రూ.65 కోట్లు ఖర్చు చేశాం. ఇదికాక రూ.1.2 లక్షల కోట్లు రైతన్నలకు వివిధ పథకాలు ద్వారా అందించామన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వీ యస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు ఐ తిరుపాల్ రెడ్డి, ఉద్యానవనశాఖ సలహాదారు పి శివప్రసాద్‌రెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు.