రాజకీయాల్లో విశ్వనీయత ముఖ్యం
చంద్రబాబుకు విశ్వసనీయత లేదు
రేపటి నుంచి 45 రోజులపాటు కీలకం
రూ.2 లక్షల 55 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో జమ చేశాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి
గుంటూరు : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనం కంటే క్యాడర్ నే ముందుగా సిద్దం చేసుకుంటున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మరో కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే క్యాడర్ తో ప్రాంతాల వారీగా సిద్దం సభలు నిర్వహిస్తున్న జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 3 వేల మంది కీలక నేతలతో మరో సిద్ధం భేటీ నిర్వహించారు. ఇందులో వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎలా గెలవాలన్న దానిపై వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు ఎలా సాధించాలన్న దానిపై మరోసారి ప్రధానంగా సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
45 రోజులపాటు కీలకం : అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైఎస్సార్సీపీ సమాయత్తమైంది. మంగళగిరిలో మంగళవారం పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. 175 నియోజకవర్గాల నుంచి 2,500 మంది నేతల్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. రేపటి నుంచి 45 రోజులపాటు కీలకం. మనం చేసిన మంచి పనులు, చేసే మంచిని ప్రజలకు చెప్పండి. రాజకీయాల్లో విశ్వనీయత ముఖ్యం. చంద్రబాబుకు విశ్వసనీయత లేదు. 2014లో చంద్రబాబు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలిచ్చారు. సాధ్యపడని హామీలను కూడా మేనిఫెస్టోలో పెట్టారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలు నాకు ఇంకా గుర్తుంది. రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, బంగారం లోన్లు తీరుస్తానన్నాడు. సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశాడు. అసలు అమలు సాధ్యం కాని హామీలు ఎలా ఇచ్చాడో చంద్రబాబుకే తెలియాలి. ఒక హామీ ఒక నాయకుడు ఇచ్చాడంటే దానికి విశ్వసనీయత ఉండాలి. తప్పుడు హామీలు ఎప్పుడు మనం ఇవ్వలేదు, ఇవ్వం కూడా. మనం ఏది ఇవ్వగలమో.. అది చెబుతున్నా. 99 శాతం హామీలన్నింటిని నెరవేర్చాం. దేశంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని స్పష్టం చేశారు.
మోసం ఎప్పుడూ నిలబడదు : 2019లో మనం అమలు చేయగలిగే హామీలిచ్చాం. ప్రజలకు గుర్తుండిపోయేలా 2019 మేనిఫెస్టో తెచ్చాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలరా? అని అడిగారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరతామని ఆనాడు చెప్పా. ఇది చెప్పాం .. ఇది చేశాం అని ఇంటింటికి వెళ్లి చెప్పగలుగుతున్నాం. మన పథకాలతో 87 శాతం పైచిలుకు కుటుంబాలకు సంక్షేమం అందిచాం. కుప్పంలో 93 శాతం కుటుంబాలకు మేలు చేశాం. కుప్పంలో 87 వేల ఇళ్లు ఉంటే 83 వేల ఇళ్లకు మంచి జరిగిందన్నారు. కుప్పంలో 83 వేల కుటుంబాలకు రూ.1,400 కోట్లు ఇచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా బటన్ నొక్కడం, ఏకంగా రూ.2 లక్షల 55 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో జమ చేశాం. మనం చేసిన మంచి చూసి ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 57 నెలల్లో పూర్తి ప్రక్షాళన జరిగింది. సంక్షేమ పాలన అందించాం. గతంలో వెయ్యి రూపాయలు ఉన్న ఫించన్ ను 3 వేలకు చేశామని వివరించారు.
ఓటర్లకు ఎప్పుడూ అందుబాటులో : ఉండాలి : ప్రతీ బూత్ లో 60 శాతం ఓట్లు సాధించేలా చేయాల్సిన పనులేంటో వారికి స్పష్టంగా చెప్పేసారు. నేతలు ప్రజలకు, ఓటర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సీఎం జగన్ సూచించారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ నిర్వహణ , ప్లానింగ్ పై దృష్టి పెట్టాలన్నారు. రాబోయే 45 రోజులు చాలా కీలకమన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్ధాయిలో ఏం జరుగుతుందో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్నీ పర్యవేక్షిస్తున్నామని నేతలకు సీఎం జగన్ తెలిపారు. మేము సిద్ధం -మా బూత్ సిద్ధం అనుకుంటూ అందరు దీనిపై దృష్టి పెట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఎన్నికల బూత్ లోనూ 60 శాతం ఓట్ల సాధనే లక్ష్యంగా పని చేయాలని నేతలకు జగన్ సూచించారు. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి ఆ మేరకు వారికి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.