సీమను తిట్టే బాబు కావాలా.. మంచి చేసే మీ బిడ్డ కావాలా?
కుప్పంకు ప్రయోజనంలేని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం
చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా
కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలి
కుప్పంలోని శాంతిపురం సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
కుప్పం : టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 35 ఏళ్లు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆయన వల్ల మంచి జరిగిందా?. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిందా అనేది ఆలోచించుకోవాలని కుప్పం ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. రెండు లక్షల మంది ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలని మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కలను సాకారం చేసిందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. కుప్పంలోని శాంతిపురం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ‘2022లో కుప్పంకు వచ్చినప్పుడు కృష్ణా నీటిని తీసుకొస్తానని హామీ ఇచ్చాను. ఇప్పుడు కృష్ణా జలాలను సగర్వంగా కుప్పంకు తీసుకువచ్చాం. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలు కుప్పం ప్రవేశించాయి. కుప్పుం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని చెప్పిన చేసి చూపించాం. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ బిడ్డ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కుప్పానికి 35ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేక మోసం చేసే చంద్రబాబు కావాలా? అని ముఖ్యమంత్రి జగన్ కుప్పం ప్రజలను అడిగారు. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు వస్తుంటాయి. పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడూ కూడా ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నది మీ బిడ్డ. చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్ముకూడా తన నియోజకవర్గంలో కూడా తనవారు, తనకు కాని వారు అని ఎలా విభజించాడో నేను చెప్పిన ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ఈ పెద్దమనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఇక్కడ, తన ధనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 ఏళ్లుగా రాజ్యం ఏలుతున్నాడు. కనీసం ఇక్కడ సొంత ఇళ్లు అయినా కట్టుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీతో పని కావాలి. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కూడా ఏరోజూ రాలేదంటే ఈ మనిషి మీ మీద చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలని కోరారు.
పొత్తులెందుకు అని అడిగితే మాట్లాడడు : సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు. పొత్తులెందుకు అని అడిగితే మాట్లాడడు. మీ పేరు చెబితే ఒక్క మంచి పని అయినా ఉందా? ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడిగితే మాట్లాడడు. ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేకపోతే ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలికి వదిలేసే రాజకీయం చంద్రబాబు చేస్తున్నది కావాలా?. 14 సంవత్సరాలు తాను చేసింది ఏంటంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చే సరికే ప్రజల్ని వెన్నుపోటు పొడవడం కోసం, మోసం చేయడం కోసం రంగులతో మేనిఫెస్టో తెస్తాడు. ప్రతీ ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటాడు. కేవలం అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు ఎందుకని వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా? : కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు ఇక్కడ ఎమ్మెల్యేగా అర్హుడేనా?. చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడారు. 35 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఇళ్లు కూడా కట్టుకోలేదు. కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా?. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా?. మంచి చేసుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు?. కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలి. రంగాను హత్య చేయించింది చంద్రబాబే కదా. ఇప్పుడు వైఎస్సార్సీపీ తరపున భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి. భరత్ గెలిచిన తర్వాత మంత్రి చేస్తాం. కుప్పాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం. రెండు లక్షల మంది ప్రజలకు మంచినీరు. సాగునీరు అందించాలని మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కలను సాకారం చేసింది. కృష్ణా జలాల నిల్వ కోసం మరో రెండు ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టాం. అందుకోసం పరిపాలనపరమైన అనుమతులు కూడా ఇచ్చాం. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులను నింపుతాం. ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో కుప్పంకు సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తున్నాం. 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. ఈ 35 ఏళ్ల కాలంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు. కుప్పంకు ప్రయోజనంలేని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం. కుప్పం బ్రాంచ్ కెనాల్ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు నిధులు పారే ప్రాజెక్ట్‌గా చేసుకున్నారు. ప్రాజెక్ట్ అంచనాలు పెంచి అయినవాళ్లకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టారు. చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు. వెల్లూరు మెడికల్ కాలేజీని చిత్తూరు జిల్లాకు రాకుండా చేసింది చంద్రబాబు. కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమాన్ని అందించాం. రాష్ట్రంలో పెన్షన్ల కోసం క్యూలైన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చేశాం. ప్రతీనెలా ఇంటికే వచ్చి వలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారు. చంద్రబాబు హయంలో అరకొర ఫీజు రియింబర్స్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రతీ విద్యార్థికి వంద శాతం ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరూ మిస్ అవకుండా అందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నాం. ప్రజలను మోసం చేయడానికి రంగుల మేనిఫెస్టోతో వస్తారు. కేవలం అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు ఎందుకని ప్రశ్నించారు.