పిఎం- ఏబీహెచ్ఐఎం ద్వారా 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటుకు శంకుస్థాపన
వర్చువల్ విధానం ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
కడప : కడప రిమ్స్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్) లో రూ.23.75 కోట్ల కేంద్ర నిధులతో ఏర్పాటు చేసిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ) ఏర్పాటు కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం వర్చువల్ విధానం ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలోని పిఎం -ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ మిషన్ పథకం అమలులో భాగంగా భారత ప్రభుత్వం దేశంలోని పలు జిల్లా స్థాయి ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే మన దేశ వ్యాప్తంగా మన రాష్ట్రంలోని పలు ప్రధాన ఆస్పత్రులతో పాటు కడప రిమ్స్ జిజిహెచ్ లో కుడా రూ.23.75 కోట్ల నిధులతో క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ) ఏర్పాటుకు రాజ్ కోట్ నుండి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మంత్రి మన్సుఖ్ మాండీయ తో కలిసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ శిలాఫలకాన్ని వర్చువల్ విధానం ద్వారా ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 47,775 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్థులతో క్రిటికల్ కేర్ యూనిట్ భవనాన్ని నిర్మించనున్నారు. అందుకుగాను రూ. 16.63 కోట్లు భవన నిర్మాణ పనులకు గాను, రూ.7.12 కోట్లు సంబంధిత వైద్య పరికరాల కొనుగోలుకు ఖర్చు చేయనున్నారు. రిమ్స్ సెమినార్ హాలులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. నాగరాజు, రిమ్స్ సూపరింటెండెంట్ డా.రమాదేవి, ప్రిన్సిపల్ డా. వరలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ డా. శారద, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ చంద్ర మౌళీశ్వర్ రెడ్డి, డిసిహెచ్ఎస్ డా.హిమదేవి, డా. సురేశ్వర్ రెడ్డి, జిల్లా టీకాలు అధికారి డా. ఉమామహేశ్వర కుమార్, వైద్యులు, మెడికల్ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది హాజరవ్వగా జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల నుండి వైద్యులు, ఏఎన్ఎంలు ఆశాలు, తదితరులు ప్రధాని కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించారు.