హైదరాబాద్ : హుజూర్ నగర్ నియోజకవర్గంలో దాదాపు రూ. 437 .70 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ప్రారంభించారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి లతో కలసి ఈ పనులను ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మాణంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు పరిశీలన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ నియోజక వర్గం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చింతల పాలెం మండలం దొండపాడు సమీపంలో రూ. 400 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నఇన్నోవేర కెమికల్ ఫాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇదే మండలంలోని నక్కగూడెంలో సుదీర్ఘ కాలంగా మరమ్మతులకు నోచుకోకుండా నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పధకం పునరుద్ధరణ పనులను మంత్రులు ప్రారంభించారు. రూ.37 .70 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పధకం పనుల పూర్తితో కిష్టాపురం, చింతిర్యాల, నక్కగూడెం గ్రామాల్లో 3200 ఎకరాల పంట పొలాలకు సాగునీటి సౌకర్యం కలుగుతుంది. ఈ మార్గంలోని కిష్టాపురం గ్రామం వద్ద మిర్చీ తోటలను మంత్రులు పరిశీలించి అక్కడి రైతులు, వ్యవసాయ కూలీలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమా రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు పంటల పరిస్థితులపై చర్చించారు.