కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం యోచన
పీఆర్సీ ఇస్తామంటున్నాం..ఐఆర్ ఎందుకు?
మంత్రి బొత్స సత్యనారాయణ
వెలగపూడి : ‘మధ్యంతర భృతి ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదు. పూర్తి స్థాయిలో పీఆర్సీనే ప్రకటిస్తాం’ ఇదే విషయాన్ని ఉద్యోగులకు చెప్పామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగ సంఘాలతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. గతంలో కరోనా వల్ల పీఆర్సీ ప్రకటించలేకపోయామని, అందుకే మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామన్నామని తెలిపారు. తాము పీఆర్సీనే ఇస్తామంటున్నప్పుడు ఇక ఐఆర్ ఎందుకని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం యోచన చేస్తోందన్నారు. కోర్టు కేసుల వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయిందని, ప్రభుత్వం అన్ని అంశాల్లో ప్రజాస్వామ్య బద్ధంగానే వ్యవహరిస్తోందని తెలిపారు. తాడేపల్లిగూడెం సభపై బొత్స వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఏమీ చేయలేకపోతే అవి ప్రతిపక్షాలు ఎలా అవుతాయన్నారు. పండుగ ముందు గంగిరెద్దులు వచ్చినట్టే ఎన్నికల ముందు ప్రతిపక్షాలు వస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గంటా ఓడిపోయి ఆయన రికార్డు అతనే చెరిపేసుకుంటారని బొత్స వ్యాఖ్యానించారు.
ఉద్యోగులపై మంత్రి బొత్స సత్యనారాయణ చిరాకు : బకాయిలు చెల్లించాలని వినతి పత్రం ఇచ్చిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకు పడ్డారు. ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన మంత్రిని ఉద్యోగులు చుట్టుముట్టారు. సమస్యలను మంత్రికి ఏకరవు పెట్టారు. ఎన్నికల కోడ్ రాకముందే బకాయిలు చెల్లించాలని కోరిన ఉద్యోగులపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌కు, బకాయిల విడుదలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.
షర్మిల అరెస్ట్ విషయం తెలియదు : ‘‘ఛలో సెక్రటేరియట్’’ బయలుదేరిన వైఎస్ షర్మిలను నిన్న (గురువారం) పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. షర్మిల అరెస్ట్ వార్త అందరికీ తెలిసిందే. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం షర్మిల అరెస్ట్ విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా స్వామ్యయుతంగానే ఉంటామని, చట్టం తన పని తానే చేసుకుంటుందని అన్నారు. రాజకీయ పార్టీలు తపస్సులు చేసుకుంటాయా ?. సభలు సమావేశాలు పెట్టుకోవాలిగా అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా ప్రాంతం వైపు సంక్రాంతి అప్పుడు వేషాలను వేసుకొస్తారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి వాళ్ల వేషాలతో వస్తారు. నా మీద ఎవరో ఒకరు పోటీ చేయాలి కదా.. ప్రతిపక్ష పార్టీల నుండి గంటా పోటీ చేస్తే చేయమనండి. పోటీ చేసే ఆ ఒక్కరే గంటా అవుతారేమో. నియోజకవర్గం మారిన ప్రతిసారి గంటా గెలిస్తే ఈ సారి రికార్డ్ తప్పుతుంది ఏమో’’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు.
జీవోలను బట్టి ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం : బండి శ్రీనివాసరావు
ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతాయని, జీవోలు ఇచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. 49 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టామన్నారు. 30శాతం ఐఆర్ అడిగితే ప్రభుత్వం పీఆర్సీ ఇస్తామని చెబుతోందన్నారు. జీవోలను బట్టి తమ ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. గత సమావేశంలో చెప్పిన అంశాలనే ప్రభుత్వం మళ్లీ చెప్పిందని పేర్కొన్నారు.
సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ : ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు ఇతర సర్వీసు అంశాలపై చర్చించేందుకు శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ డిమాండ్లతో పాటు నూతన పీఆర్సీ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి,ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారి చైతన్య, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నుండి ఎపిఎన్జీఓ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామి రెడ్డి, ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఎపిజెఎసి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.సూర్య నారాయణ, ఎపిఎస్టియు అధ్యక్షులు సాయి శ్రీనివాస్, పిఆర్టియు అధ్యక్షులు ఎం.కృష్ణయ్య,యూటీఎఫ్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, ఎపి టిఎఫ్ అధ్యక్షులు ఎన్.హృదయరాజు, ఎపి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎస్.బాలాజీ, ఎపి ప్రభుత్వ డ్రైవర్ల సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్, ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ల అధ్యక్షులు చంద్రశేఖర్, మల్లేశ్వరరావు, ఎపి వెటర్నరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాఘవ రావు, తదితర ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.