ముఖ్యఅతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
ఏర్పాట్లను పరిశీలించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
ఏలూరు : పొత్తుల విషయం ఎలా ఉన్నా బీజేపీ కార్యకర్తలు అందరూ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమయ్యారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారని బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఈనెల 27న ఏలూరులో ప్రజా పోరు పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటున్న నేపథ్యంలో సభ నిర్వహించనున్న ఏలూరులోని ఇండోర్ స్టేడియం ప్రాంగణాన్ని గురువారం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి తదితరులు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ప్రజా పోరుపేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టబోతున్నామని, ఈ యాత్ర ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పబోతున్నామని అన్నారు. కస్టర్డ్ల ద్వారా బూత్ కమిటీలను ఏర్పాటు చేశామని, ఈనెల 27న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏలూరు వస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు భాజపా సిద్ధంగానే ఉందని, కేంద్రం పార్టీ ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని అన్నారు. తాను ఎంపీ, ఎమ్మెల్యే ఏ స్థానానికి పోటీ చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని వారి ఆదేశాల మేరకు పోటీ చేస్తానని అన్నారు. జగన్ మద్యపాన నిషేధం అన్నారని ఎక్కడ అది జరగలేదన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. బిజెపి ప్రజా పోరు యాత్రలో వైసిపి మోసాలను ప్రజల ముందు ఉంచి నిలదీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ, జిల్లా బిజెపి అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కృష్ణ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.