మంగళగిరి నియోజకవర్గంలో స్థానికుడిని గెలిపించుకుందాం
ఆర్కే మళ్లీ పార్టీలోకి రావడం మంచి పరిణామం
పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఆర్కే కృషి చేస్తారు
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
గుంటూరు : రాష్ట్ర ప్రజల సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్లుగా జనరంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా గెలిపించుకుందామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయ సాయిరెడ్డి అన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ, రూరల్ వైఎస్ఆర్ సిపి కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. తాడేపల్లి చెక్ పోస్టు నుండి క్రిస్టియన్ పేట వరకు సాగిన ర్యాలిలో పెద్ద ఎత్తన కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యాలయం ప్రజలకు ఇక నుండి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని చెప్పారు. టిడిపి యువనేత లోకేష్ ను ఉద్దేశించి మాట్లాడుతూ మంగళగిరి శాసనసభ్యునిగా స్థానికంగా ఉండే వ్యక్తి కావాలా, స్థానికేతరుడు కావాలా ? ప్రజలు తేల్చుకోవాలన్నారు. మీ నియోజక వర్గంలో నివసించే వ్యక్తి మీతో ఉండే మనిషిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో నివాసముండే వ్యక్తి అపాయింట్మెంట్ స్థానిక ప్రజలకు దొరికే అవకాశం లేదన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి,24 గంటలు , 365 రోజులు మీతో మంగళగిరిలో ఉండే మనిషిని గెలిపించుకోవాలని కోరారు. తనను తాను మూర్ఖునిగా చెప్పుకునే వ్యక్తి శాసన సభ్యునిగా కావాలా వద్దా అన్నది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి పార్టీలో రావడం మంచి పరిణామమని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరిలో వరుసగా మూడోసారి గెలుపు ఖాయమని అన్నారు. మీరందరూ గతంలో ఆర్కే కి ఏ రకంగా అయితే పని చేసి గెలిపించారో అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టి వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తూ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ నియోజక వర్గాన్ని ఒక చేనేత వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు. ఈ శాసనసభ నియోజకవర్గానికి మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది త్వరలో నిర్ణయిస్తారని. ఆర్కే లేనటువంటి ఈ రెండు నెలల కాలంలో నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి అద్భుతంగా పనిచేశారని కొనియాడారు.. ఈ నియోజకవర్గంలో భవిష్యత్తులో ఆర్కే పార్టీ తరఫున, పార్టీ నియమించబడేటటువంటి అభ్యర్థి తరపున పనిచేస్తారని స్పష్టం చేశారు. తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి పార్టీ కార్యాలయాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రాంత ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య రహదారులు పూర్తిగా పాడైనటువంటి రోడ్ల మరమ్మతులు చేయించడానికి చర్యలు మొదలు పెట్టామని చెప్పారు. దుగ్గిరాల మండలంలో ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, కాలువల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. త్వరలో నియోజకవర్గంలోని నిరుద్యోగులు కోసం జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. క్రికెట్ పోటిలను నిర్వహిస్తామని చెప్పారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ మరుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తదితరులు పాల్గొన్నారు.