నీపా ఆచార్యులు డాక్టర్ చారుస్మిత మాలిక్
ప్రారంభమైన లీడర్ షిప్ విభాగం సదరన్ రీజియన్ లెవెల్ వర్క్ షాప్
విజయవాడ : రాష్ట్రస్థాయిలో పాఠశాల నాయకత్వ విభాగాలని అభివృద్ధి చేయాలని, తద్వారా పాఠశాల నాయకత్వం ఆచరణలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల అభ్యసన ఫలితాలని మెరుగుపరచాలని జాతీయ విద్య పరిపాలన నిర్వహణ సంస్థ ఆచార్యులు డాక్టర్ చారుస్మిత మాలిక్ తెలిపారు. సమగ్ర శిక్ష, సీమ్యాట్ పాఠశాల నాయకత్వ విభాగం (స్కూల్ లీడర్ షిప్ విభాగం) , జాతీయ పరిపాలనా నిర్వహణా సంస్థ (నీపా) న్యూఢిల్లీ సంయుక్తంగా ‘దక్షిణాది పాఠశాలల్లో ఉత్తమ నాయకత్వ ధోరణులు’ అంశం పై మూడురోజుల శిక్షణా కార్యక్రమాన్ని సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నీపా ఆచార్యులు డాక్టర్ చారుస్మిత మాలిక్ గారికి ఆంధ్రప్రదేశ్ సీమ్యాట్ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య వివరించగా, ఏపీ కార్యక్రమాల అమలు తీరును ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి, శామో జాయింట్ డైరెక్టర్ విజయభాస్కర్ , ఎన్బీటీ ప్రతినిధి పత్తిపాక మోహన్ గారు, గోవా, తెలంగాణా, న్యూఢిల్లి ప్రతినిధులు, వివిధ జిల్లాల నుంచి ప్రధానోపాధ్యాయులు, డైట్ ఉపాధ్యాయులు, సీమ్యాట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీమ్యాట్ రూపొందించిన ‘స్మృతిక’ సంచికను ఆవిష్కరించారు.