ప్రజల కష్టాల్లోంచి పుట్టిందే వైఎస్సార్సీపీ మేనిఫెస్టో
ఫలించిన సీఎం జగన్ విద్యా సంస్కరణలు
ఎంపీ విజయసాయి రెడ్డి
గుంటూరు : ఈ ఏడాది మార్చి నెలలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో అత్యధికంగా 72.54 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయనున్నట్లు, పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి తెచ్చే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన విద్యా సంస్కరణలు మంచి ఫలితాలనిచ్చాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా పలు అంశాలు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 6.23 లక్షల మంది పదో తరగతి విద్యార్దుల్లో 4.51 లక్షల మంది ఇంగ్లీష్ లోనే పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఇదేళ్లలో 25 శాతం మంది విద్యార్థులు తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంలోకి మారారని చెప్పారు.
ప్రజల కష్టాల్లోంచి పుట్టిందే వైఎస్సార్సీపీ మేనిఫెస్టో
రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి అన్ని వర్గాల ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని వాటిని తొలగించేందుకు రూపొందించిన పవిత్ర గ్రంధమే వైఎస్సార్సీపీ మేనిఫెస్టో అని ఈ మేరకు అమలు చేసే పథకాలు ప్రజలను పేదరికం నుంచి దూరం చేశాయని విజయసాయి రెడ్డి అన్నారు. అయితే చంద్రబాబు మేనిఫెస్టో మాత్రం పక్క రాష్ట్రాల నుంచి పుట్టుకొచ్చిందని అన్నారు.
ఫైబర్ ఫ్రాడ్ చంద్రబాబు
ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని అన్నారు. ఫైబర్ ఫ్రాడ్ కు అసలు సూత్రధారి చంద్రబాబేనని అన్నారు. టెరాసార్ట్ సంస్థకు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ ఫైబర్ నెట్ ప్రాజక్టు అడ్డుగోలుగా అప్పగించారని తెలిపారు. తొలిదశ పనుల్లో రూ. 333 కోట్లు ప్రజాధనం లూటీ చేశారని, నకిలీ ఇన్వాయిస్ లతో షెల్ కంపెనీల ద్వారా తరలించారని అన్నారు. సీఐడీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో చంద్రబాబు ఏ1 కాగా, ఏ2 వేమూరి, ఏ3 కోగంటి ఉన్నారని తెలిపారు.