లైంగిక వేధింపులు, సైబర్ నేరాలపై చిన్నారుల్లో, తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాలి
తల్లిదండ్రులు సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో కొంత సమయం గడపాలి
మిస్సింగ్ కేసులను 24 గంటల్లో చేధించేందుకు పోలీసులు కృషి చేయాలి
బాలలపై జరిగే లైంగిక నేరాలలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
ముగిసిన ‘పోక్సో’ అంశంపై రెండురోజుల రాష్ట్రస్థాయి కన్సల్టేషన్ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి మజ్జి బబిత
విజయవాడ : బాలలపై నేరాలకు పాల్పడిన కేసులలో న్యాయ, పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ శాఖల సమన్వయంతో పనిచేసి నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చూడాలని ఏపీఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి మజ్జి బబిత పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ సీఆర్ఏఎఫ్’ ఆధ్వర్యంలో విజయవాడలో రెండురోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి కన్సల్టేషన్ ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఏపీ బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు, ఏపీఎఫ్ఎస్ఎల్ జాయింట్ డైరెక్టర్ డి.వెంకటేశ్వర్లు, ఏపీఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.ఫణిభూషణ్, ఏపీఎస్ఎల్ఎస్ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హెచ్. అమర రంగేశ్వరరావు, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ పి.ఫ్రాన్సిస్ తంబి, ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్ పర్సన్ జి.ప్రమీల రాణి, దిశ డీఎస్పీ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత మాట్లాడుతూ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ (పోక్సో) -2012 పై రాష్ట్రస్థాయి కన్సల్టేషన్ నిర్వహించేందుకు ప్రోత్సహించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ ఏవీ శేషసాయికి ధన్యవాదాలు తెలిపారు. లైంగిక నేరాల నుంచి పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. లైంగిక వేధింపులు, పోక్సో చట్టంపై తల్లిదండ్రులు, పిల్లలకు చైతన్యం కలిగేలా పోలీసులతో పాటు ఆయా శాఖలు సైతం బాధ్యతతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాలలపై జరిగే లైంగిక నేరాలలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నిరక్షరాస్యుల నుంచి అక్షరజ్ఞానం కలిగిన వారు కూడా నేడు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారు. బాధితుల నుంచి సకాలంలో వివరాలు సేకరించి నిందితులపై కేసులు నమోదు చేసి వారికి శిక్షలు పడేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్లో సైబర్ నేరస్తులు చాలా సందర్భాల్లో మైనర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇటీవల క్రెడిట్ కార్డులు, ఆన్ లైన్ గేమ్స్ పేరుతో జరుగుతున్న మోసాలే ఇందుకు నిదర్శనమన్నారు. తల్లిదండ్రులు కూడా సమయం దొరికినప్పుడు పిల్లలతో కొంత సమయం గడపాలని, సైబర్ నేరాలు, మోసాలు, వివిధ రకాల లైంగిక నేరాల గురించి వారికి వివరించాలన్నారు. ఏపీ బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో అధికార యంత్రాంగం సమన్వయం చాలా ముఖ్యమన్నారు. రెండురోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి కన్సల్టేషన్ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు నివేదించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రజలతో పాటు అధికారుల్లో కూడా అవగాహన కల్పించే ఇలాంటి సెమినార్లు మరిన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీఎఫ్ఎస్ఎల్ జాయింట్ డైరెక్టర్ డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోక్సో కేసుల్లో ఫోరెన్సిక్ ఇన్విస్టిగేషన్ కు డేటా సేకరణలో అసురించాల్సిన పద్ధతులను వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం ద్వారా కలిగే అనర్థాల గురించి వివరించారు. లైంగిక వేధింపుల కేసుల్లో 70 శాతం ఎవిడెన్స్ గా మొబైల్ ఫోన్స్ ఉంటే, ఇతర వస్తువులు 30 శాతం ఉంటున్నాయన్నారు. సెల్ ఫోన్స్, మెయిల్స్ కు వచ్చే అపరిచిత మెసేజ్ లను పూర్తిగా చదవకుండా స్పందించకూడదని.. నిర్లక్ష్యంగా ఉంటే వ్యక్తిగత సమాచారం నిమిషాల్లోనే చోరీకి గురవుతుందన్నారు.
ఏపీఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ బి.ఫణిభూషణ్ మాట్లాడుతూ లైంగిక దాడులు, పోక్సో కేసుల్లో డీఎన్ఏ శాంపిల్స్ సేకరణ, పాటించాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశ్లేషించారు. డీఎన్ఏ రిపోర్టు ఏ ఒక్కరికీ ఒకేలా ఉండదని, బాధితుల నుంచి వీలైనంత త్వరగా ఆధారాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. వన్ స్టాప్ సెంటర్ అధికారిణి శైలజ మాట్లాడుతూ పోక్సో నేరాలు, లైంగిక దాడుల బాధితులకు వన్‌స్టాప్ సెంటర్లు భరోసా కేంద్రాలుగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు, పిల్లల సంక్షేమ కమిటీ సభ్యులు, దిశ పోలీస్ అధికారులు, పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, వివిధ జిల్లాల లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, వన్ స్టాప్ సెంటర్ అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.