నాణ్యమైన విద్య ఒక హక్కు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం
గుంటూరు : మన పిల్లలు ప్రపంచస్థాయితో పోటీపడాలని అప్పుడే భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంవోయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం. కానీ పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు. ఇది ఇక కొత్త నినాదం అని అన్నారు. నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారని, ఈదేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ. ప్రపంచంతో మనం పోటీపడుతున్నామన్నారు. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి. మంచి మంచి జీతాలు సంపాదించాలి. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం అన్నారు.
విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి : ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే. మనం నాటిన ఈ విత్తనం చెట్టై ప్రతిఫలాలలు వచ్చేసరికి కొంత సమయం పట్టవచ్చు. ఉన్నత విద్యలో మనం వేసే అడుగులు ఫలాలు ఇవ్వాలంటే నాలుగైదు సంవత్సరాలు పట్టవచ్చు. మనం వేసిన ప్రతి అడుగు ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి, మన ప్రాధమిక విద్య స్ధాయి నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నాం. మానవవనరులమీద పెట్టుబడి అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా మన ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి అడుగులోనూ చిత్తశుద్ధి, అంకితభావం చూపిస్తున్నాం అన్నారు. ప్రాధమికస్ధాయి నుంచి విద్యలో జరుగుతున్న మార్పులు గమనిస్తే అక్కడ నుంచే అడుగులు పడుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఏర్పాటు చేశాం. గ్లోబల్ సిటిజెన్స్ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పులు రావాలి. ప్రపంచస్ధాయితో పోటీపడాలి. అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదన్నారు.
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం చేయడం నుంచి మొదలు, నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చడం, పిల్లలను బడులకు తీసుకువచ్చే కార్యక్రమానికి స్ఫూర్తి కోసం అమ్మఒడి, గోరుముద్దతో మొదలు పెట్టాం. ఇంగ్లిషు మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా రానున్న పది సంవత్సరాలకు, ఇవాళ ఒకటో తరగతి చదువుతున్న పిల్లవాడు పదోతరగతికి వచ్చేసరికి ఐబీ విద్యావిధానంలో బోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఐబీ వాళ్లతో ఎంఓయూ చేసుకున్నాం. వాళ్లు మన ఎస్సీఈఆర్టీలో భాగమై ఈ ఏడాది టీచర్లకు సామర్ధ్యాన్ని పెంచడంపై దృష్టి పెడతారు. ఈ ఏడాది టీచర్ల సామర్ధ్యం పెంచడంపై దృష్టి పెట్టడంతో పాటు వచ్చే ఏడాది ఒకటో తరగతి, ఆ తర్వాత రెండో తరగతి ఇలా 2035 నాటికి ఏకంగా మన పిల్లలు ఐబీలో పరీక్షలు రాసే స్ధాయికి మన పిల్లల చదువులను తీసుకునిపోతాం. 6వతరగతి నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్‌బీలను ప్రతి క్లాస్‌రూంలలో ఏర్పాటు చేస్తున్నాం. 8వతరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చి, పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ సులభంగా అర్ధం అయ్యేలా చేస్తున్నాం. బైజూస్ కంటెంట్‌ను అనుసంధానం చేశాం. బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్ ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగులో ప్రతి ప్రభుత్వ స్కూళ్లో అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు : ఉన్నతవిద్యలో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజెన్స్‌గా తయారవుతారు. ప్రపంచంతో పోటీపడతారు. ఉన్నతవిద్యారంగం మీద ఈ ఐదు సంవత్సరాల మీద పెట్టిన ధ్యాస ఇంతకముందు ఎవరికీ ఊహకు కూడా అందని విధంగా ధ్యాసపెట్టి అడుగులు వేయించగలిగాం. మొట్ట మొదటిసారిగా పిల్లలు కచ్చితంగా చదవాలి. వారి చదువులకు పేదరికం అడ్డురాకూడని అడుగులు వేశాం. దీనికోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. ప్రతి ఏటా విద్యాసంవత్సరం జూన్ –జూలై లోనూ, అలాగే విద్యాసంవత్సరం చివర్లో కూడా వసతి దీవెన అందిస్తున్నాం. ఉద్యోగాల సాధనే ధ్యేయంగా పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకువచ్చాం. దాదాపు 30శాతం కోర్సులు స్కిల్ ఓరియెంటెడ్‌గా మార్పులు చెందాయి. మొట్టమొదటిసారిగా డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్ పాఠ్యపుస్తకాలు తీసుకువచ్చాం. తొలిసారిగా మూడేళ్ల కోర్సులో కూడా ఇంటర్న్‌షిప్ తప్పనిసరిగా చేస్తున్నాం. మూడేళ్ల కోర్సుతో పాటు ఇంకో ఏడాది హానర్స్డిగ్రీ ఇచ్చే విధంగా తీసుకువచ్చాం. తొలిసారిగా 400 పైగా బైలింగువల్ పాడ్‌క్యాస్టులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీ చేసే ప్రయత్నం వేగంగా జరుగుతుంది. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్ధలు మాత్రమే న్యాక్ గుర్తింపు పొందగా ఈ రోజు రాష్ట్రంలో న్యాక్ గుర్తింపు పొందిన విద్యాసంస్ధలు 437 ఉన్నాయన్నారు.
ప్రతి అడుగులో విద్యలో నాణ్యత పెంచాలి : దాదాపుగా 2వేలకు పైగా కోర్సులు మన పాఠ్యప్రణాళికలో వర్టికల్స్ కింద మన పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటీ, ఎల్ఎస్ఈ, హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులు కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చు. వాళ్లు కోర్సులు ఆఫర్ చేసి బోధిస్తారు. మన పిల్లలు ఆన్లైన్లో వాళ్లతో ఇంటరాక్ట్ అయి డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి. ఫైనల్‌గా పరీక్షలు జరుగుతాయి. మన పిల్లలు ఆ పరీక్షలు పాసవుతారు. క్రెడిట్స్ మన పాఠ్యప్రణాళికలో భాగం అవుతాయి. మనదగ్గర యూనివర్సిటీలలో అందుబాటులో లేని కోర్సులు కూడా వాళ్ల దగ్గర నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, రియల్ ఎస్టేట్ మేనేజిమెంట్, సైబర్ ఫోరెన్సిక్, స్టాక్ ఎక్సేంజ్, వెల్త్ మేనేజిమెంట్, రిస్క్ మేనేజిమెంట్, ఫైథాన్ కోర్సుల వంటివన్నీ ఎంఐటీ, హార్వర్డు సంస్ధలు సర్టిఫై చేసి మన పిల్లలకు ఇస్తాయి. ఆయా సంస్ధలకు వెళ్లి చదువుకున్నవాళ్లు చేసే కోర్సులు ఇక్కడే మన యూనివర్సిటీల్లో అందుబాటులోకి వస్తాయన్నారు.