విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 25న జరగబోయే ఎ.పి.పిఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5 వేల మందికి పైగా అభ్యర్థులు రాస్తున్న ఈ పరీక్షకు బ్యాంక్ క్లరికల్ పరీక్ష అడ్డురావడంతో, అభ్యర్థులు సందిగ్ధంలో ఉన్నారని జైభారత్ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇటీవల వెలువడిన ఎస్.బి.ఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష తేదీ కూడా ఫిబ్రవరి 25 తేదీనే కావడంతో చాలా మంది అభ్యర్థులు ఎదో ఒక్క పరీక్షనే ఎంచుకునే దుస్థితి నెలకొందన్నారు. ఆరేళ్ళ తర్వాత వచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారని, ఇక 2019 తరువాత ఎస్.బి.ఐ. క్లర్క్ నోటిఫికేషన్ రావడం మళ్ళీ ఇపుడే అని జేడీ చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్ యంత్రాంగం వెంటనే స్పందించి, పరీక్ష తేదీ వాయిదా వేయాలని కోరారు. అభ్యర్థులకు వచ్చిన ఈ రెండు అవకాశాలను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.