వెలగపూడి : త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు వైసిపి తరపున నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్ధుల నామినేషన్లు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్టు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం. విజయరాజు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎంపి అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా, ఆయా అభ్యర్ధుల తరపున హాజరైన ప్రతినిధుల సమక్షంలో జరిగింది. వైసిపి తరపున రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, వై.వి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు పరిశీలించగా ముగ్గురు అభ్యర్ధు వారి నామినేషన్లతో అవసరమైన పలు డాక్యుమెంట్లన్నీ పూర్తి స్థాయిలో సక్రమంగా సమర్పించడంతో ఆముగ్గురు అభ్యర్ధుల నామినేషన్లను ఆమోదించినట్టు రిటర్నింగ్ అధికారి విజయరాజు వెల్లడించారు.కాగా స్వతంత్ర అభ్యర్ధిగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు నామినేషన్ దాఖలు చేయగా ఆయనకు కనీసం 10 మంది ఎంఎల్ఏల మద్ధత్తు కూడిన పత్రాన్ని సమర్పించక పోవడంతో నామినేషన్ల పరిశీలనలో ఆతని నామినేషన్ ను తిరస్కరించినట్టు ఆర్ ఓ విజయరాజు స్పష్టం చేశారు. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 20వ తేదీ వరకూ గడువు ఉన్నందున ఆరోజున ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ అభ్యర్ధుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి విజయ రాజు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా సమక్షంలో జరిగిన ఈ నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి, డిప్యూటీ సెక్రటరీ వనితా రాణి, అభ్యర్ధుల తరపున వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.