17 సార్లు ఎన్నికలు
కాంగ్రెస్ ఐదు సార్లు,కాంగ్రెస్-ఐ ఐదు
టిడిపి మూడు,బిజెపి రెండు
సిపిఐ,సోషలిస్టు, వైయస్సార్ సీపీ ఒక్కొక్కసారి
కమ్మ వర్గీయులదే పె చేయి
సినీ నటులకు ఆదరణ
రాజ మహేంద్ర వరం: సాంస్కృతిక రాజధాని రాజమండ్రి నుండి పార్లమెంటుకు ఎందరో ప్రముఖులు వెళ్లారు. రాజమండ్రి విశిష్టతను చాటి చెప్పారు. 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి.1952లో దిసభ్య నియోజకవర్గం కావడంతో ఇద్దరు ఎంపి లు గా గెలుపొందారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి అయిదుగురు గెలుపొందగా కాంగ్రెస్-ఐ నుంచి ఐదుగురు, తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు, బిజెపి నుంచి ఇద్దరు, సిపిఐ, సోషలిస్టు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు. 1967లో డి.సీతారామరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఆయనే అప్పటి నుంచి వరసగా మూడుసార్లు అంటే 57, 62 ,67 లలో ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. అలాగే కపిలేశ్వరం జమిందారు ఎస్.బి.పి పట్టాభి రామారావు 1971, 77, 80 లలో వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలుపొందడం విశేషం.రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి కాంగ్రెస్ -ఐ నుంచి గెలిచారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్-ఐ పార్టీలో వరుసగా రెండుసార్లు గెలిచింది ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రమే. ఈయన 2004,2009 లలో ఎంపీగా గెలుపొందారు. 1991లో టిడిపి నుంచి గెలుపొందిన కెవిఆర్ చౌదరి ఆ తర్వాత ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1971లో ఎస్ బి పి పట్టాభి రామారావు 1,96,482 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈయన రికార్డును ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేదు. 2009లో ఉండవల్లి అరుణ్ కుమార్ కేవలం 2147 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.ఈ నియోజకవర్గానికి ఇదే అత్యల్ప మెజారిటీ. కపిలేశ్వరపురం జమిందారు సోదరులు పట్టాభి రామారావు, గుంటూరు సత్యనారాయణ రావు అన్నదమ్ములు. అంతే కాదు వీరిద్దరూ కేంద్ర మంత్రి పదవులు చేపట్టడం విశేషం.
సినీ నటులకు ఆదరణ..
సినీ నటులను కూడా ఈ నియోజకవర్గం బాగానే ఆదరించింది. ప్రముఖ హీరోయిన్ జమున, ప్రముఖ సినీ నటుడు మాగంటి మురళీమోహన్, యవ హీరో మార్గాని భరత్ లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.అలాగే మురళీ మోహన్, జమునలతో పాటు ప్రముఖ హీరో కృష్ణంరాజు కూడా ఇక్కడ ఓటమి చెందారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కింగ్ మేకర్ గా పేరొందిన ఎస్ఆర్ఎంటి చౌదరి అల్లుళ్లు చిట్టూరి రవీంద్ర,చుండ్రు శ్రీహరి లు వేరువేరు పార్టీల నుంచి ఎంపీలుగా విజయం సాధించారు.
కమ్మ సామాజివర్గానికే పెద్ద పీట
సినీనటి జమున, ఉండవల్లి అరుణ్ కుమార్ లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా రెడ్డి నాయుడు, గిరిజాల వెంకటస్వామి నాయుడు లు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. డి.సీతారామ రాజు క్షత్రియ వర్గం. ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్ గౌడ సామాజిక వర్గం వారు కాగా మిగిలిన వారంతా కమ్మ సామాజిక వర్గం వారే ఇక్కడ విజయం సాధించారు.
పార్లమెంట్ కి వెళ్లింది వీరే
2019.. మార్గాని భరత్.. వైసీపీ
2014..మాగంటి మురళీమోహన్.. టిడిపి
2009..ఉండవల్లి అరుణ్ కుమార్.. కాంగ్రెస్-ఐ
2004.. ఉండవల్లి అరుణ్ కుమార్.. కాంగ్రెస్-ఐ
1999..ఎస్.బి.పి.బి.కె సత్యనారాయణ రావు.. బిజెపి
1998.. గిరజాల వెంకటస్వామి నాయుడు.. బిజెపి
1996.. చిట్టూరి రవీంద్ర.. కాంగ్రెస్-ఐ
1991.. కెవిఆర్ చౌదరి.. టిడిపి
1989.. జమున.. కాంగ్రెస్-ఐ
1984.. చుండ్రు శ్రీహరిరావు.. టిడిపి
1980..ఎస్బిపి పట్టాభి రామారావు. కాంగ్రెస్-ఐ
1977.. ఎస్.బి.పి పట్టాభి రామారావు.. కాంగ్రెస్
1971.. ఎస్ బి పి పట్టాభి రామారావు.. కాంగ్రెస్
1967. డి సీతారామరాజు.. కాంగ్రెస్
1962.. డి సీతారామరాజు.. కాంగ్రెస్
1957.. డి సీతారామరాజు(ఏకగ్రీవం).. కాంగ్రెస్
1952. కావేటి మోహన్ రావు.. సిపిఐ(ద్విసభ్య)
ఎస్ రెడ్డి నాయుడు.. సోషలిస్ట్