ఆర్.ఎస్.ఎస్.కబంధ హస్తాల్లో బిజెపి
దేశం ప్రమాదకర స్థితిలో ఉంది
విశాఖ నుంచి పోటీకి రెడీ
మీట్ ది ప్రెస్ లో డాక్టర్ కే.ఏ.పాల్
విజయవాడ : అన్ని రాజకీయ పార్టీలు కేంద్రాల్లో ఉన్న బిజెపికి దాసోహం అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కే ఏ పాల్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ దేశానికి అతిపెద్ద ప్రమాదకరిగా మారిందని, బిజెపి, ఆర్ఎస్ఎస్ కబంధహస్తాల్లో దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు .విజయవాడ ఏపీయూడబ్ల్యూజే భవన్ లో ఆదివారం డాక్టర్ కే ఏ పాల్ తో మీట్ ది ప్రెస్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ కే ఏ పాల్ మాట్లాడుతూ దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని ,దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శాంతి దూతగా ఉన్న నేను దేశాలు వదిలి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు తిరుగుతున్నాను అనేదానిపై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీని స్థాపించటం, దేశాన్ని, ఆంధ్రప్రదేశ్‌ను శాంతియుతంగా అభివృద్ధి పథంలో పయనింపజేయటానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.
డాక్టర్లు, ఐఏఎస్ ,ఐపీఎస్ ఎంతోమంది సీనియర్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. 54 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీగా ప్రజాశాంతి పార్టీ నిలిచిందని తెలిపారు. మోడీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఏ కులం వారైనా పేద బడుగు వర్గాల ప్రజల కోసం పోరాటం చేసినట్టు ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ కు ఎందుకు భారతరత్న ఇవ్వలేదని ప్రశ్నించారు. స్వర్గీయ బాలయోగిని కుట్ర చేసి చంపేశారని, పివి నరసింహారావు అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదించినట్లు ఆయన గుర్తు చేశారు. మోడీని ఢీ కొట్టే నాయకులు ఎవరూ లేరని, ఇతరులను విమర్శించలేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు వీటిపైన మాట్లాడటం లేదని, పవన్ కళ్యాణ్ చిరంజీవి కలిసి పెట్టిన పార్టీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజా రాజ్యం పార్టీని స్థాపించటం దాన్ని కాంగ్రెస్ విలీనం చేయటం వంటివి ఎందుకు చేశారు. 20 సీట్లకు ఎందుకు అమ్ముడుపోయారని ప్రశ్నించారు .తాను అధికారంలోకి వస్తే 10 లక్షల కోట్లు ఒక్క సమ్మిట్ ద్వారా తీసుకొచ్చి దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పైన చేస్తానని డాక్టర్ కే ఏ పాల్ వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దగ్గరకు వచ్చి ఎకనామిక్ సమ్మిట్ పెట్టమని కోరితే తాను దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ స్వస్థత పరచాలని ఆయన్ని పరామర్శించి ప్రార్థించినట్లు తెలిపారు. అటు దేశం ఇటు రాష్ట్రాలు అప్పుల కుప్పలో కూరుకు పోతున్నాయని ప్రతి వ్యక్తి పైన కోటి రూపాయల అప్పు ఉందని వీటిని తీర్చే సత్తా తనకే ఉందని పేర్కొన్నారు .ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పేర్కొన్నట్లు తెలిపారు.
చంద్రబాబు హయాంలో బిల్ గేట్స్ ని తీసుకొచ్చానని ఈ విషయాన్ని 20 సార్లు చంద్రబాబు బహిరంగంగానే చెప్పినట్లు తెలిపారు. నేను సిద్ధం అని జగన్ అంటే పవన్ కూడా మేము సిద్ధమే అంటున్నారని, చంద్రబాబు సైతం సంసిద్ధం అంటున్నారని మీరు దేనికి సిద్ధం అనేది వెల్లడించాలని కే ఏ పాల్ ప్రశ్నించారు. ఇప్పటికే 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇంకా దేనికి సిద్ధం అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు .అప్పు చేయొద్దని చెప్పినందుకే కెసిఆర్ తనపై దాడి చేయించినట్లు గుర్తు చేశారు .అప్పుడే కెసిఆర్ ను శపించానని, చిత్తుగా ఓడిపోతారని చెబితే అదే జరిగిందని పేర్కొన్నారు. తాను ఎవరిని దీవిస్తే వారు సీఎం అవుతారని ఏ ఛానల్ వారు తనకు లైవ్ ఇస్తే వారిని దేవుడు దీవిస్తారని ఆయన వెల్లడించారు . ప్రధాని నరేంద్ర మోడీని ప్రతి వ్యక్తి వెళ్లి కలుస్తున్నారని ఆయన ఒక్క హామీ అయినా నెరవేర్చరా అని ప్రశ్నించారు.
చైతన్యం కలిగిన ఆంధ్రులు ఉక్కు కర్మాగారం అమ్మేస్తుంటే ఆయా పార్టీలు ఏం చేశాయని ప్రశ్నించారు. పొత్తులు కోసం వెంపర్లాడే పార్టీలే కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించేవారు లేరన్నారు. ఒక్క ప్రజా శాంతి పార్టీ మాత్రమే ఆ విధంగా చేయగలుగుతుందని డాక్టర్ పాల్ వెల్లడించారు. ఒక్కసారి ప్రజాశాంతి పార్టీకి అధికారం ఇచ్చి చూడాలని, ఎనిమిది శాతం ఉన్న ప్రజలు 92 శాతం ఉన్న ప్రజల్ని పరిపాలన చేస్తున్నారని, ఇది సామాజికంగా ఏమాత్రం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు .ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఐజెయు సభ్యులు ఎస్కే బాబు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ,కార్యదర్శులు కంచల జయరాజ్ , దాసరి నాగరాజు, ఏపీడబ్ల్యూజే స్టేట్ కమిటీ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, జి రామారావు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు సాంబశివరావు, యూనియన్ నాయకులు బి. వి శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు.