గాంధీ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ పిలుపు
విజయవాడ : రానున్న ఎన్నికల్లో సత్ప్రవర్తన గల అభ్యర్థులని ఎన్నుకోవాలని ప్రజలకు గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ పిలుపునిచ్చారు. శనివారం ఊర్మిళ నగర్ లోని ట్రస్ట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా మంచి నాయకులను అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. ఈ విషయమై తాను త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు ఆయన చెప్పారు. దేశాన్ని పెట్టుబడిదారీ చేతుల్లోనూ, మతతత్వవాదుల చేతుల్లోనూ పెట్టడం ప్రమాదకరమని గాంధీ నాగరాజన్ హెచ్చరించారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని నెరవేర్చే నాయకుల అవసరం నేడు ఎంతో ఉందని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దాన్ని అమ్ముకోకూడదని ఓటర్లకు హితవు చెప్పారు. డబ్బుకు మద్యానికి లొంగిపోయి ఓట్లు వేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని గాంధీ నాగరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం సీట్లు దక్కాల్సిన అవసరం ఉందని , నాడే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమావేశంలో ట్రస్ట్ ఏపీ బాధ్యురాలు బంగారు భారతి తదితరులు పాల్గొన్నారు.