ఇంటర్నెట్‌డెస్క్: రాజకీయ నాయకులు, మాజీ సైనికోద్యోగులు, స్థానికులను లక్ష్యంగా చేసుకొని జమ్ములో భారీ ఉగ్రదాడి జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఒక స్థానిక ఉగ్రవాది, ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదుల కదలికలను భధ్రతా దళాలు బారాముల్లాలో గుర్తించాయి. ఈ ఉగ్రవాదులు దాడులకు హ్యాండ్ గ్రనేడ్లు, ఐఈడీలను ఉపయోగించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ యూనిట్లు పేర్కొంటున్నాయి. ఈ ఉగ్రవాద బృందం బారాముల్లాలోని ఛక్లూ గ్రామంలో తిరుగుతుండగా అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం గుర్తించారు. మరోవైపు జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ నుంచి ముప్పు పొంచి ఉందని తెలిపారు. ‘‘పోలీసులను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారిని కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చు’’ అని దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జమ్ము కశ్మీర్‌లోని అవంతిపొరలో ఆత్మాహుతి ఉగ్రదాడిని ముందుగానే గుర్తించి అడ్డుకొన్నారు. భద్రతా దళాల క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి చేసేందుకు లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కమాండర్ ముక్తార్ భట్ ఓ విదేశీ ఉగ్రవాది, మరో స్థానిక ఉగ్రవాదితో కలిసి సిద్ధమయ్యాడు. భద్రతా దళాలు ముందస్తుగా దాడి చేసి ఈ కుట్రను భగ్నం చేశాయి. ఈ సందర్భంగా జరిగిన ఆపరేషన్‌లో భట్ సహా ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. శ్రీనగర్‌లో మరో ఘటనలో ఓ ఉగ్రవాదిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 10 కిలోల ఐఈడీని, రెండు హ్యాండ్ గ్రనేడ్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. ఐఈడీని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి.