విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో బుధవారం 2024–25 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.రావత్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, అదనపు కార్యదర్శి (ఎఫ్ఏసీ) బి.సునీల్కుమార్రెడ్డిలు బడ్జెట్ ప్రతులతో ఇంద్రకీలాద్రికి విచ్చేయగా ఆలయ ఛైర్మన్ కర్నాటి రాంబాబు సాదరంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న రాష్ట్ర ఆర్ధికశాఖ బృందం బడ్జెట్ ప్రతులను అమ్మవారి చెంతన ఉంచి పూజలు జరిపించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ ఛైర్మన్ రాంబాబు, ఈఈ కోటేశ్వరరావులు, ఎఈవో రమేష్‌బాబు అమ్మవారి ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందచేశారు.