గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ పీ సీ ఎన్ ఎఫ్ (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) పేరుతో రైతు సాధికార సంస్థ ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు మరో అంతర్జాతీయ ప్రతినిధి బృందం ఈ నెల 3,4 వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనుంది. అంతర్జాతీయ స్థాయిలో అటవీ, వ్యవసాయ పర్యావరణం, సుస్థిరాభివృద్ధి, జీవనోపాదుల పరిరక్షణ, పర్యావరణం, వాతావరణంలో మార్పు అనుసరణ, తీవ్రతను తగ్గించడం తదితర రంగాలలో పనిచేసే బీఏంజెడ్, కే ఎఫ్ డబ్ల్యూ, జీ ఐ జెడ్ సంస్థల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొంటారు. సీనియర్ పాలసీ అడ్వైసర్ క్రిస్టోఫ్ వాన్ స్టెచో, సీనియర్ పాలసీ ఆఫీసర్ అలెగ్జాండర్ లింగెంతాల్ల తో పాటు, కే ఎఫ్ డబ్ల్యూ కంట్రీ మేనేజర్ జోష్కా గ్రేవ్, సీనియర్ సెక్టార్ స్పెషలిస్ట్ సంగీత అగర్వాల్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ విభాగం క్లస్టర్ కోఆర్డినేటర్ మొహమ్మద్ ఎల్-ఖవాద్, న్యాచురల్ రిసోర్స్ మేనేజ్ మెంట్, ఆగ్రో ఎకాలజీ డైరెక్టర్ రాజీవ్ అహల్, ప్రాజెక్ట్ హెడ్ ఫర్ ఆగ్రో ఏకాలజి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ యూటే రిక్మాన్ లు ఈ పర్యటన బృందంలో ఉంటారు. ఈ బృందం ఇండో జర్మన్ డెవలప్మెంట్ కో ఆపరేషన్ ఫ్రేమ్ వర్క్ లో భాగంగా అటవీ, వ్యవసాయ పర్యావరణం, సుస్థిరాభివృద్ధి, జీవనోపాదుల పరిరక్షణ, పర్యావరణం, వాతావరణంలో మార్పు తదితర రంగాలలో ఆంధ్ర ప్రదేశ్ లో అమలులో ఉన్న ప్రాజెక్టు లు, ప్రణాళిక దశలో ఉన్న కార్యక్రమాలను పరిశీలించి అర్థం చేసుకోవడానికి పర్యటించనుంది. ప్రకృతికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ దిశగా ఆంధ్ర ప్రదేశ్ లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకుగాను ఈ బృందం 3 వ తేదీన శ్రీ సత్య సాయి జిల్లాలోని బత్తలపల్లి మండలం రాఘవం పల్లి గ్రామంలోని ఆదర్శ రైతుల వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తారు. ఆ తర్వాత ఏ పీ సీ ఎన్ ఎఫ్ ప్రాజెక్టు సిబ్బంది, గ్రామ ఐక్య, మహిళా సంఘాల ప్రతినిధులతో చర్చిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బయలుదేరి పులివెందుల వెళతారు. 3 వ తేదీ సాయంత్రం పులివెందులలోని ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ రిసెర్చ్ అండ్ లెర్నింగ్ సెంటర్ ను సందర్శిస్తారు. బృందం అకాడమీ లో జరుగుతున్న కార్యక్రమాలపై ఇచ్చే ప్రెసెంటేషన్ ద్వారా అకాడమీ లో జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకొంటారు. అనంతరం అకాడమీ లో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త శిక్షణలో భాగంగా అక్కడ శిక్షణ పొందుతున్న రైతు శాస్త్రవేత్తలు, మెంటార్ లతో చర్చిస్తారు. 4 వ తేదీన ఈ బృందం అకాడమీ కార్యాలయ సముదాయాన్ని పరిశీలించి ప్రాంగణంలో వివిధ మోడల్స్ లో రూపొందించిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తుంది. అకాడమీ బృందం క్యాంపస్ లో వేసిన వివిధ వ్యవసాయ నమూనాలను గురించి విదేశీ బృందానికి వివరిస్తారు. ఈ సంధర్భంగా విదేశీ ప్రతినిధి బృందం క్యాంపస్ లో మొక్కలు నాటుతారు.