అమెరికా-దక్షిణ కొరియా యుద్ధవిన్యాసాలకు 10 క్షిపణి పరీక్షలతో ఉత్తరకొరియా స్పందించింది. ఈ క్షిపణులు దక్షిణ కొరియాకు చెందిన ఓ ద్వీపం సమీపంలో కూలాయి.
ఇంటర్నెట్‌డెస్క్: ఉత్తరకొరియా బుధవారం ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో కొన్ని దక్షిణ కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. ఈ విషయాన్ని ద.కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ పేర్కొన్నారు. ఇంత దగ్గరగా ఉత్తర కొరియా క్షిపణులు పడటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఉల్లెంగ్డో ద్వీపంలో గగనతల రక్షణ వ్యవస్థ సైరన్లు మోగుతూనే ఉన్నాయి. మరో వైపు దక్షిణకొరియా-అమెరికా విజిలెంట్ స్ట్రామ్ పేరిట యుద్ధవిన్యాసాలను ప్రారంభించాయి. వీటిల్లో 240 యుద్ధవిమానాలు పాల్గొంటున్నాయి. ఈ విన్యాసాలను ఉత్తరకొరియా తీవ్రంగా ఖండించింది. తమపై దండయాత్ర జరపాలనే దురుద్దేశంతోనే అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలకు పాల్పడుతున్నాయనీ, దీనికి తమవైపు నుంచి శక్తిమంతమైన ప్రతి చర్యలు ఉంటాయని ఉత్తర కొరియా విదేశాంగశాఖ మంగళవారం హెచ్చరించింది.
ఆ ప్రతిచర్యలు ఏమిటో వివరించకపోయినా, అణ్వాయుధ పరీక్షను మరికొన్ని వారాల్లో నిర్వహించేందుకు ఉత్తర కొరియా సన్నాహాలు చేస్తున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. దక్షిణ కొరియా సైన్యం ఏటా నిర్వహించే 12 రోజుల అభ్యాసాలను ఇటీవలే ముగించింది. అందులో అమెరికన్ సైనికులూ పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ఉభయ దేశాల యుద్ధ విమానాల విన్యాసాలు ఆరంభమయ్యాయి. వచ్చే శుక్రవారం వరకూ ఇవి కొనసాగుతాయి. కొవిడ్‌కు తోడు.. ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలకు అనుకూల వాతావరణం ఏర్పరచాలన్న తలంపు వల్ల కొన్నేళ్లుగా అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలను నిలిపేశాయి.ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు పెరిగిన సమయంలో ఉత్తరకొరియా అధినేత కిమ్ తన ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తున్నాడని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దక్షిణ కొరియాపై టాక్టికల్ అణుబాంబు ప్రయోగానికి సిద్ధమవుతున్నామని గత నెల ఆ దేశానికి చెందిన మీడియా ప్రకటించింది. మరోవైపు ఈ క్షిపణి పరీక్షలపై జపాన్ ప్రధాని కిషిదా స్పందించారు. జాతీయ భద్రతా మండలి సమావేశానికి ఆయన పిలుపునిచ్చారు.