ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉచిత సేవలు అందిస్తున్నాం
హెల్ప్ లైన్ నెంబర్ 0863 2340678, వాట్సప్ నెంబర్ : 8500027678 లలో సంప్రదించి తక్షణ సహాయం
ఏపీఎన్ఆర్టీఎస్ ట్రస్ట్ కు ఇప్పటి వరకు అందిన విరాళాలు రూ. 7 కోట్లు
విదేశాల్లో 200 మందికి పైగా కో ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు
30కి పైగా దేశాల్లోని ఎంబసీ, సీజీఐలతో సమన్వయం చేస్తున్న ఏపీఎన్ఆర్టీఎస్
ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా ఉచిత అంబులెన్స్ సేవలు
ప్రవాసాంధ్రులకు అవసరమైన అన్ని సేవలు ఉచితంగా
ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి
గుంటూరు : ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాష్ట్రవాసులకు అనేక రకాల ఉచిత సేవలు అందిస్తూ వారికోసం నిరంతరాయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఏపీఎన్ఆర్టీఎస్ పని చేస్తున్నదని సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. ప్రవాసాంధ్రులకు అందిస్తున్న సేవలు, సహాకారంపై తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీఎస్ కార్యాలయంలో బుధవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ 2019 నుంచి ఇప్పటి వరకు ప్రవాసాంధ్రులకు అనేక సేవలు అందిస్తున్నామన్నారు. ప్రవాసాంధ్రుల కోసం 24/7 హెల్స్ లైన్ అందుబాటులో ఉంచామన్నారు. ప్రవాసాంధ్ర బీమా, ఉచిత అంబులెన్స్ సర్వీస్, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా, అడ్వాన్స్డ్ ఐటీ కోర్సులలో శిక్షణ, అంతర్జాతీయ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలతో పాటు స్థానిక, విదేశీ కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పించడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాసాంధ్రులకు తగు సూచనలు, సలహాలు అందించటంలో సహకారం అందిస్తున్నామన్నారు. అలాగే ఏపీ పోలీస్ ఎన్నారై సెల్ ద్వారా ప్రవాసాంధ్రులకు స్వరాష్ట్రంలో స్థిర, చర ఆస్తి వివాదాలు, వివాహ సమస్యలు- మోసాలు పరిష్కరించటంలో తగు సూచనలు అందిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఎంబసీలతో సమన్వయం చేస్తూ ఇబ్బందుల్లో ఉన్న వారిని స్వదేశానికి తీసుకురావడం, ఆయా దేశాల ఆమ్నేస్టీ ప్రకటించినప్పుడు రాష్ట్ర వాసులను ఉచితంగా స్వస్థలాలకు తీసుకురావటం వంటి అనేక సేవా కార్యక్రమాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యా వాహిని ద్వారా విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు విద్యావాహిని ద్వారా ఉచిత కౌన్సిలింగ్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన గురించి వివరించి వారికి అవగాహన పెంచుతున్నామని ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. ఏపీఎన్ఆర్టీ ట్రస్ట్ ద్వారా ప్రవాసాంధ్రులు వారి స్వగ్రామాలు, పట్టణాలల్లోని పాఠశాలల్లో విద్యార్థుల కోసం లైబ్రరీలు, ఆర్వో పాంట్ల ఏర్పాటు, ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో నాడు-నేడులో పొందుపరచని మౌలిక వసతులు సమకూర్చడం, ఇతర అభివృద్ధికి తోడ్పాటు అందించే కార్యక్రమాలు చేయడం వాటిని ట్రస్ట్ సంబంధిత శాఖలు, అధికారులతో సమన్వయం చేస్తున్నదని వివరించారు. అంతేకాకుండా పాస్ పోర్టు, పీసీసీలలో డాక్యుమెంటేషన్ సహాయం అందించటం, పోగొట్టుకున్న అవసరమైన పత్రాలను తిరిగి పొందడంలో సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని తిరుపతి ఇతర పుణ్యక్షేత్రాలలో విఐపీ దర్శనం ఇతర సేవలను ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా అందిస్తున్నామన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ సొసైటీలో 2.20 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని, తమ సంస్థ ద్వారా 28కి పైగా సేవలను ప్రవాసాంధ్రులకు అందిస్తున్నామని సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. తమ సంస్థ ద్వారా 2.55 లక్షల మందికి పైగా లబ్ధి పొందారని, వారందరూ తమ సేవలు, సహకారంపై సంతృప్తి వ్యక్తం చేయటం సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థకు వివిధ దేశాలలో 200 మందికి పైగా కో ఆర్డినేటర్లు ఉన్నారని వివరించారు. అలాగే 30కి పైగా దేశాల ఎంబసీ, సీజీఐలతో సమన్వయం చేసుకుంటూ ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు తక్షణ సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రవాసాంధ్రుల నుంచి ఇప్పటి వరకు హెల్ప్ లైన్ ద్వారా 2.02 లక్షలకు పైగా కాల్స్ రిసీవ్ చేసుకున్నామని పేర్కొన్నారు. విదేశాల్లో మరణించిన ప్రవాసాంధ్రుడి పై ఆధారపడిన కుటుంబానికి ఆర్థిక ఆసరాగా ఇస్తున్న ఎక్స్ గ్రేషియా కింద ఇప్పటి వరకు రూ. 2.44 కోట్లను 489 మందికి అందించామని చెప్పారు. విదేశాల్లో మరణించిన వారి భౌతికకాయాల్ని విమానాశ్రాయాల నుండి వారి స్వగ్రామాలకు తరలించటానికి రూ. 1.93 కోట్లు ఖర్చు చేసి1,077 అంబులెన్స్ లు ఏర్పాటు చేశామన్నారు. విదేశాల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమయంలో ఉదాహరణకు కువైట్, ఉక్రెయిన్, సుడాన్, ఇజ్రాయిల్ వంటి దేశాల్లో విద్యార్థులను, ఉద్యోగులను, వలస కార్మికులను, పర్యటనలకు వెళ్లిన వారిని ఇప్పటి వరకు 3,610 మందిని స్వదేశానికి తీసుకువచ్చామని ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని టీటీడీ తో సహా పలు పుణ్యక్షేత్రాల్లో 6,169 ప్రవాసాంధ్ర కుటుంబాలకు దర్శనాలు చేయించామని వివరించారు. ఏపీ పోలీస్ ఎన్నారై సెల్ మరియు మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ (ఎంఆర్సీ సెల్) ద్వారా ఇప్పటి వరకు 1739 గ్రీవెన్స్ లు పరిష్కరించినట్లు తెలిపారు. వివిధ కారణాలతో ఇప్పటి వరకు విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి 900 మందికి పైగా తీసుకువచ్చామన్నారు. అమ్నేస్టీ, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రవాసాంధ్రులను స్వదేశానికి తీసుకురావటానికి రూ. 1.10 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రవాసాంధ్ర భరోసా బీమా 33,596 మంది తీసుకున్నారని, రూ. 44.05 లక్షల క్లెయిమ్స్ విడుదల చేశామని, పురోగతిలో ఉన్న క్లెయిమ్స్ రూ. 25.53 లక్షలు ఉన్నాయని ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. ఈ బీమా కు సంబంధించి ఉద్యోగులు కడుతున్న ప్రీమియంలో 50శాతం, విద్యార్ధులు కడుతున్న ప్రీమియం వంద శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇప్పటి వరకు విద్యావాహిని ద్వారా 3,118 మంది విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. ప్రపంచంలోని 130కి పైగా దేశాల్లోని తెలుగు సంఘాలతో సమన్వయం చేసుకుంటూ అక్కడి వారికి తక్షణ సహాయ, సహకారాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విదేశాల్లో టీటీడీ సహకారంతో 46 శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణమహోత్సవాలు భక్తి ప్రవత్తులతో నిర్వహించినట్లు తెలిపారు. ఏపీఎన్ఆర్టీ సోసైటీ ద్వారా ఎగ్జామ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆన్ లైన్ శిక్షణ ఇచ్చామని, శిక్షణా తరగతుకులకు 6,800 మంది హజరయ్యారని చెప్పారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కడప, శ్రీకాకుళం, కాకినాడ, అన్నమయ్య జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సక్రమ వలసలపై 14 అవగాహన సదస్సులు నిర్వహించామని వివరించారు. ఏపీఎన్ఆర్టీ ట్రస్ట్ కు ఇప్పటి వరకు ధన, వస్తు రూపేణా రూ. 7 కోట్లు విరాళాలు అందాయన్నారు. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు, విదేశాల్లో ఉన్న వారు ఏపీఎన్ఆర్టీఎస్ లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా హెల్స్ లైన్ నెంబర్లు 0863 2340678, వాట్సప్ : 85000 2628 నెంబర్లను ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని వెంకట్ కోరారు. కార్యక్రమంలో సంస్థ సీఈవో పి. హేమలత రాణి, డైరక్టర్ బి. హెచ్. ఇలియాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.