డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటం
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పరేడ్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటం
అమరావతి : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పరేడ్ లో డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన శకటం పలువురిని ఆకట్టుకుందని తెలిపింది. దేశంలోని 28 రాష్ట్రాల శకటాలు పరేడ్ లో పాల్గొనగా పీపుల్స్ ఛాయిస్ విభాగంలో రాష్ట్ర విద్యాశాఖ శకటానికి ఈ అవార్డు లభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పీపుల్స్ ఛాయిస్ విభాగంలో లో ప్రథమ, ద్వితీయ బహుమతులు వరుసగా గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వచ్చినట్లు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు,వినూత్న పథకాలను తీసుకు రావడం, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా బోధన అందించేలా చేస్తున్న ప్రయత్నాలు, డిజిటల్ బోధనలో భాగంగా 62వేల ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్, స్మార్ట్ టీవీలతో డిజిటల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేయడం, ఇంగ్లీష్ ల్యాబ్ లు, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, ప్రాథమిక స్థాయి నుండే ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, టోఫెల్ (ప్రైమరీ, జూనియర్, సీనియర్) సర్టిఫికేషన్, సీబీఎస్ఈ, ఐబీ తో సిలబస్ అనుసంధానం , 8వ తరగతి విద్యార్థులు, బోధించే ఉపాధ్యాయులకు ఉచితంగా ట్యాబ్ లు పంపిణీ చేయడం, మనబడి నాడు- నేడుతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడం వంటి అంశాలు ఆహుతులను విపరీతంగా ఆకట్టుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇవే గాక విద్యా రంగంలో జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, 3వ తరగతి నుండే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ వంటి విభిన్నమైన విద్యా కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా మారాయని చెప్పడంలో అతిశయోక్తి లేదని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.
“చదువులే పిల్లలకు తాము ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి అని, విద్యా రంగంపై చేసే ఖర్చంతా రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడి అని బలంగా విశ్వసించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకనుగుణంగా కేవలం విద్యా రంగ సంస్కరణలపై మాత్రమే ఈ 56 నెలల్లో రూ.73,417 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించింది. రాష్ట్ర విద్యాశాఖ శకటానికి దేశస్థాయిలో తృతీయ బహుమతి రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీపుల్స్ ఛాయిస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ శకటానికి బహుమతి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసింది.