బోయవాండ్లపల్లి లబ్ధిదారులకు 53 మందికి వ్యవసాయ భూమి హక్కు పత్రాల పంపిణీ
సుమారు రూ.6 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి బుగ్గన ప్రారంభోత్సవం
నంద్యాల : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్యాపిలి మండలంలో వాల్మీకి గుహలను ప్రారంభించారు. సుమారు రూ.6 కోట్ల విలువైన పనులను పూర్తి చేసి వాటికి సంబంధించిన పైలాన్ లను ఆయన ఆవిష్కరించారు. బోయవాండ్లపల్లి గ్రామంలో ప్రకృతి ద్వారా సహజ సిద్ధంగా ఏర్పడిన వాల్మీకి గుహలను రూ.3 కోట్లతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినట్లు మంత్రి పేర్కొన్నారు.అతి ప్రాచీన చరిత్ర కలిగి రామాయణంతో ముడిపడి ఉండటం ఈ గుహలకు అత్యంత ప్రాధాన్యత చేకూరిందన్నారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఈ గుహలలో తపస్సు చేసినట్లు స్థానికులు చెప్పుకుంటారన్నారు. వందల ఏళ్ల నాటి నుంచి ఈ గుహలున్నప్పటికీ బయట ప్రపంచానికి తెలిసేలా తీర్చిదిద్దిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చొరవను బోయవాండ్లపల్లి గ్రామస్థులు ప్రశంసించారు. అనంతరం బోయవాండ్లపల్లి గ్రామ ప్రజలకు 53 మందికి 108 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన హక్కు పత్రాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పంపిణీ చేశారు. అంతకు ముందు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్యాపిలి మండలంలో రాచవండ్లపల్లి గ్రామం వరకూ రూ.1.93 కోట్లతో నిర్మించిన రహదారిని ప్రారంభించారు. దానికి ముందు రాయలచెరువు రోడ్డు నుంచి పెద్దపాయి వరకూ రూ.44 లక్షలతో నిర్మించిన తారు రోడ్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పాదయాత్ర చేస్తూ పెద్దపాయికి చేరి అక్కడ పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మండల వ్యవసాయ సలహాదారు మెట్టుపల్లి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.