బ్రిటన్ ప్రధాని హోదాలో రిషి సునాక్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వాతావరణ సదస్సుకు హాజరుకావొద్దని ఆయన తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు.
లండన్: బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఆదిలోనే పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వాతావరణ సదస్సుకు హాజరుకాకూడదని ఆయన తీసుకున్న నిర్ణయంపై దేశంలోనే గాక, ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో రిషి సునాక్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ సదస్సుకు హాజరవుతానంటూ తాజాగా ట్వీట్ చేశారు.‘వాతావరణ మార్పులపై నియంత్రణ చర్యలు తీసుకోకపోతే దీర్ఘకాల శ్రేయస్సు సాధ్యం కాదు. పునరుత్పాదక వనరులకు ఖర్చు చేయకపోతే ఇంధన భద్రత ఉండదు. అందుకే వచ్చేవారం జరగబోయే 27వ వాతావరణ సదస్సుకు నేను హాజరవుతాను. గ్లాస్గో వారసత్వాన్ని కొనసాగిస్తూ సురక్షితమైన, స్థిరమైన భవిష్యత్తు నిర్మాణంపై ప్రసంగిస్తాను’’ – ట్విటర్లో రిషి సునాక్
ఈజిప్టు వేదికగా నవంబరు 6 నుంచి 18 వరకు వాతావరణ సదస్సు జరగనుంది. అయితే ఈ సదస్సుకు ప్రధాని సునాక్ హాజరయ్యే అవకాశం లేదని డౌనింగ్ స్ట్రీట్ గతవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. యూకేలో ముందస్తుగా నిర్ణయించిన పలు సమావేశాలు, కార్యక్రమాల నేపథ్యంలో ఆయన ఈ సదస్సుకు హాజరకాకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో సునాక్‌పై విమర్శలు వచ్చాయి. యూకే తీరు ఆందోళన కలిగిస్తోందని.. పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో బ్రిటన్ చేతులు దులుపుకోవాలని చూస్తోందా? అని పలువురు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. ఈ సదస్సుకు యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే రిషి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.గతేడాది గ్లాస్గోలో జరిగిన పర్యావరణ సదస్సుకు అప్పటి యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వం వహించారు. అప్పట్లో కేబినెట్ మంత్రిగా ఉన్న అలోక్ శర్మ అధ్యక్షతన ఆ సమావేశాలు జరిగాయి. బ్రిటన్ రాజు ఛార్లెస్.. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హోదాలో ఆ సదస్సుకు హాజరయ్యారు.