అనంతపురంలో ఎన్నికల సమాయత్త సమావేశం
సీఎం వైయస్ జగన్ కేడర్ కు దిశానిర్ధేశం చేస్తారు
వచ్చే నెల 10 లేదా 11వ తేదీల్లో జరిగే అవకాశం
రాష్ట్రంలోనే ఈ సభ అతి పెద్దదిగా నిర్వహించ బోతున్నాం
ఎన్నికలకు సిద్దం సభపై పోస్టర్ విడుదల
గత ఎన్నికల్లో కోల్పోయిన మూడు సీట్లను కూడా గెలుచుకుంటాం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి : అనంతపురంలో వచ్చేనెలలో ఎన్నికల సమాయత్తంపై వైయస్ఆర్ సిపి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ బహిరంగసభకు సంబందించి సోమవారం తిరుపతిలోని పిఎల్ఆర్ కన్వెన్షన్ లో రాయలసీమకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతపురంలో వచ్చే నెల 10 లేదా 11వ తేదీల్లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నాం. బహిరంగ సభ జరిగే తేదీని పార్టీ ఖరారు చేసి ప్రకటిస్తుంది. సీఎం వైయస్ జగన్ ఈ సభలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తారు. రాష్ట్రంలోనే ఈ బహిరంగ సభ అతి పెద్దదిగా ఉండబోతోంది. దాదాపు అయిదు లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారని అంచనా. కీలకమైన ఈ సభకు ఒక ప్రత్యేకత ఉంది. గత ఎన్నికల్లో రాయలసీమలో మూడు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ వైయస్ఆర్ సిపి విజయం సాధించింది. రాబోయే ఎన్నికల్లో ఈ మూడు స్థానాలను కూడా గెలుచుకోబోతున్నాం. ఈ సభకు ప్రధాన్యత ఇస్తూ జనసమీకరణ, సమావేశం విజయవంతం కోసం ఎమ్మెల్యేలతో, ఇతర కీలక నేతలతో చర్చించడం జరిగింది. ఈ బహిరంగసభకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. అనంతరం మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. నన్ను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు చేసిన అవినీతి ఆరోపణలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎలాంటి వ్యక్తిని అనేది జిల్లా ప్రజలకు తెలుసు. ఈ సమావేశంకు ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. వారు ముందుగానే దీనిపై సమాచారం ఇచ్చారు. సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.